పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
26న చండీహోమం
పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 26న చండీహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమం పూజలో పాల్గొనే భక్తులు రూ.2516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు.
గిరిజన మహిళలకు ఏఎన్‌ఎం
కోర్సులో ప్రవేశాలు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రైనింగ్ స్కూల్‌లో రెండేళ్ల కాలవ్యవధితో ఏఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, కనీసం 17 ఏళ్ల వయసు కలిగిన గిరిజన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు chfw. telangana. gov. inవెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, ‘కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ, హైదరాబాద్’ పేరుతో తీసిన రూ.200 డీడీ, అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి ఈనెల 28వ తేదీలోగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 94903 70905, 99633 15323, 90009 83664 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
నల్సా పథకాల
మెగా డ్రైవ్ ముగింపు
టేకులపల్లిరూరల్: మండలంలోని రోళ్లపాడు గ్రామంలో నల్సా పథకాల అమలు కోసం నిర్వహిస్తున్న 60 రోజుల మెగా డ్రైవ్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. 60 రోజుల్లో సాధించిన ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాజేందర్ సమీక్షించారు. గ్రామ సమస్యలు, పరిష్కార మార్గాలు, నిరుద్యోగ యువతకు వైటీసీ, ఐటీడీఏ ద్వారా గొర్రెల పెంపకం, మహిళలకు కుట్టు మిషన్ కేంద్రం, మెగా హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించినట్లు పారా లీగల్ వలంటీర్లు నరసింగం చరణ్ కుమార్, భారతి, రాజ కుమారి వివరించారు.
ఎన్‌సీడీ స్క్రీనింగ్
పూర్తి చేయాలి
చుంచుపల్లి: ఈ నెల 30వ తేదీ లోపు అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కరుణశ్రీ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ఎన్‌సీడీ పోర్టల్ నిర్వహణపై కన్సల్టెంట్ మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్, కేన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతాప్, ప్రసాద్, అనిల్, దినేష్, నాగలక్ష్మి, నవీన్ పాల్గొన్నారు.
బీసీ సెల్ లైజన్ ఆఫీసర్ల నియామకం
రుద్రంపూర్: సింగరేణిలో పనిచేస్తున్న బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం వివిధ ఏరియాల్లో బీసీ సెల్ లైజన్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం రిక్రూట్‌మెంట్ సెల్ జీఎం ఏజే. మురళీధర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్ ఏరియా లైజన్ ఆఫీసర్‌గా సబ్బాని లక్ష్మణ్, మందమర్రికి పిట్టల రాజు, శ్రీరాంపూర్‌కు బి.కృష్ణ ప్రసాద్, భూపాలపల్లికి పాక రాహుల్, ఇల్లెందు ఏరియా లైజన్ ఆఫీసర్‌గా పులి పూర్ణచందర్‌ను నియమించారు.


