కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. నగరాభివృద్ధికి రూ.32 కోట్లను మంజూరు చేసింది. వీటితో రోడ్లు, డ్రెయినేజీలు, జీ ప్లస్ వన్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, సబ్ డివిజన్ ఆఫీసులు, స్వాగత తోరణాలు నిర్మించనున్నారు. కాంప్లెక్స్‌లు నిర్మించి అద్దెకు ఇవ్వనుండటంతో కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సుజాతనగర్‌లో రూ.50 లక్షలతో పార్కు, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ రూ.కోటితో నిర్మించనున్నారు. మరో రూ. కోటితో అక్కడే సబ్ డివిజన్ ఆఫీసు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోడ్డు డివైడర్లకు రూ.7 లక్షలతో పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. స్వాగత తోరణాలకు రూ.కోటి వెచ్చించనున్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే నగరం కొత్త కళ సంతరించుకోనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, విదేశీ బ్యాంకు సహకారంతో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేసేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా, అవకతవకలు ఉండటంతో రద్దు చేశారు. మళ్లీ కొత్తగా టెండర్‌ను పిలిచారు.
నగర అభివృద్ధికి నిధులు
కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం


