రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోనీ వీకేసీఎం(వెంకటేష్‌ఖని కోల్‌మైన్)కు స్టేజి–2 అనుమతులు ఎట్టకేలకు లభించాయి. సుమారు ఐదేళ్ల నుంచి 649.3014 హెక్టార్ల బొగ్గు గని నిర్వహణకు అనుమతి కోసం యాజమాన్యం, కార్మికులు ఎదురుచూస్తుండగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఫారెస్ట్ విభాగాల నుంచి ఈనెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనుమతులు లభించడంతో మరో పది రోజుల్లో ఓబీ వెలికితీత పనులు మొదలుకానున్నాయి. ఈక్రమాన జీకేఓసీ సమీపంలోని బొల్లి గుట్ట తవ్వకంతో పాటు ఆనందఖని, ఆర్‌సీహెచ్‌పీ, జీఎం కార్యాలయాన్ని తొలగించాల్సి ఉంది. అయితే, అధికారులు ముందుగానే వీటిని ఖాళీ చేయడంలో నిమగ్నం కాగా.. ఏరియా వర్క్‌షాపు, జీఎం కార్యాలయాలను సైతం మరోచోట నిర్మించారు. అన్నీ అనుకూలిస్తే రానున్న మూడు మాసాల్లో వీకేసీఎంలో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుంది. అయితే గనికి అనుమతులు రాకముందే యాజమాన్యం ఏటా 20 లక్షల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించడం గమనార్హం. ప్రస్తుతం పనులు ఆశించిన రీతిలో సాగితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఇందులో కనీసం నాలుగో వంతైనా ఉత్పత్తి సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తాడిచర్ల–2 బ్లాక్, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌లు సింగరేణికి దక్కడం, తాజాగా వీకేసీఎంకు అనుమతులు రావడంతో సింగరేణికి ఊరట లభించినట్లయింది.
త్వరలో ప్రారంభం కానున్న ఓబీ పనులు


