రుద్రంపూర్: సంస్థలో ఖాళీగా ఉన్న 11 లా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 5వ తేదీ లోగా హార్ట్ కాపీలు అందజేయాలని తెలిపింది.
జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సత్యనారాయణ
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పీవీ సత్యనారాయణ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్‌స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణను పలువురు అభినందించారు.
కరువు జిల్లాగా ప్రకటించాలి
చర్ల: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడంతోపాటు పూర్తి ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాలను శాశ్వత కరువు మండలాలుగా గుర్తించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు డిమాండ్ చేశారు. గురువారం చర్లలో జరిగిన పార్టీ జనరల్‌బాడీ సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కరువు కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీలను ఆదుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతీ ఎకరానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌని నాగేశ్వరావు, ముసలి సతీష్, సంతపురి సురేష్, గొంది ముయ్యన్న, మట్టా నర్సింహారావు, రామకృష్ణ, ప్రసాద్, కొండస్వామి, అబ్బురం, సోనూ, , చిలకమ్మ, జానకి తదితరులు పాల్గొన్నారు.
పశువులు స్వాధీనం
పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి భద్రాచలం వైపు నుంచి పాల్వంచ వైపు బొలెరో వాహనంలో తరలిస్తుండగా పోలీసులు గమనించి ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం ఆపకుండా వెళ్లడంతో వెంబడించి అంబేద్కర్ సెంటర్ వద్ద పట్టుకున్నారు. విచారించగా నాలుగు ఆవులు, నాలుగు లేగ దూడలను కొత్తగూడెంలోని కబేళాకు తరలిస్తున్నట్లు తేలింది. కొత్తగూడెం హాలియా తండాకు చెందిన డ్రైవర్ కొర్రా రామ, ఓల్డ్ డిపో రోడ్‌కు చెందిన మాంసం దుకాణం యజమాని మహ్మద్ ఫయాజ్ ఖురేషి, మహమ్మద్ రెహాన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. పశువులను నవభారత్ వద్ద గల అన్నపూర్ణగోశాలకు అప్పగించారు. వాహనాన్ని సీజ్ చేశారు.
రైతు వేదికలో
స్పీకర్లు చోరీ
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల రైతు వేదికలో రూ.50 వేల విలువైన స్పీకర్లు చోరీకి గురయ్యాయి. రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటంతో గురువారం రైతు వేదిక వద్దకు చేరుకున్న ఏఈఓ సుమన్ ఏర్పాట్లు చేసుకుంటుండగా స్పీకర్లు కనిపించకలేదు. ఏడీఏ లాల్‌చంద్‌కు సమాచారం ఇవ్వడంతోపాటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


