రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

చర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకోగా, గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని చీమలపాడు గ్రామానికి చెందిన ఎల్లబోయిన కామరాజు (62) బుధవారం బైక్‌పై చర్లకు వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సుబ్బంపేట వైపు నుంచి చర్లకు వస్తున్న టాటా ఏస్‌ ట్రాలీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంతోపాటు కామరాజు ఎగిరి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాడు. ప్రమాదం జరిగాక టాటా ఏస్‌ ట్రాలీ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కాగా, చెట్ల పొదల్లో ద్విచక్రవాహనం, మృతదేహాన్ని గురువారం ఉదయం గమనించిన పాదచారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రాజువర్మ సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు చీమలపాడుకు చెందిన కామరాజుగా గుర్తించారు. మృతుడి కుమారుడు కృష్ణబాబు ఫిర్యాదుతో ఎస్సై నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అపాక శంకరరావు ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న గుర్తుతెలియని వ్యక్తులు ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి రూ.6 వేల విలువైన 25 గ్రాముల వెండి కుంకుమ భరిణెతో పాటు రూ.3 వేల నగదు అపహరించిన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మణుగూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన లావేటి విమల్‌కుమార్‌ అలియాస్‌ పండు (35)ను నిందితుడిగా గుర్తించి, ఈ నెల 17న అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.

కొండచిలువ హతం

ములకలపల్లి: సుమారు 8 అడుగుల కొండచిలువ హతమైంది. మండలకేంద్రంలోని భక్త అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో కొండచిలువ ఉన్నట్లు కుటుంబీకులు గమనించి ఆందోళన చెందారు. దీంతో స్థానికులు వచ్చి కొండచిలువను కొట్టి చంపేశారు.

ఇంటి యజమానికి బెదిరింపులు

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

భద్రాచలంఅర్బన్‌: విలేకర్లమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు బెదిరించిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజ్జిగిరి రాజాకిరణ్‌ అనే వ్యక్తి పట్టణంలోని చర్ల రోడ్డులో తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో గురువారం ముగ్గురు వ్యక్తులు వచ్చి కార్మికులను బెదిరించి పనులు అడ్డుకున్నారు. అనంతరం యజమాని దుకాణానికి వెళ్లి విలేకర్లమని చెప్పుకుంటూ నిర్మాణ అనుమతులపై ప్రశ్నించారు. పనులు కొనసాగాలంటే రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాజాకిరణ్‌ పోలీసులకు సమాచారం అందించగా, వారొచ్చి ముగ్గురిని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement