సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాకు చెందిన రైతులు గురువారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్’ (నవీన ఆవిష్కరణల నుంచి క్షేత్రస్థాయి ప్రభావం వరకు) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్‌తో కలిసి జిల్లాకు చెందిన రైతులు గొట్టిపాటి వెంకటేశ్వరచౌదరి, గాడె నర్సిరెడ్డి, జర్పుల మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరచౌదరి వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో వినియోగించడం, రైతుల ఉత్పాదకత, ఆదాయాన్ని పెంపొందించడంలో వినూత్న పద్ధతుల ప్రాధాన్యతను వివరించారు.
అపార్ట్‌మెంట్‌లో బైక్ చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెం ప్రాంతంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక మైత్రి అపార్ట్‌మెంట్‌లోకి బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయాన చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైక్ ఎత్తుకెళ్లారు. అలాగే, శృంగేరి పీఠం ఎదురుగా చెరువుకు వెళ్లే రహదారిలోని ఓ ఇంటి వద్ద స్టీల్ నల్లాలు పగులగొట్టి దొంగతనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని వాట్సప్ గ్రూప్‌ల్లో పోస్ట్ చేశారు. అనుమానిత వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


