మమ్మేలు తల్లీ.. కోట మైసమ్మా ! | - | Sakshi
Sakshi News home page

మమ్మేలు తల్లీ.. కోట మైసమ్మా !

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

● జాతరకు ముస్తాబైన ఉసిరికాయలపల్లి ఆలయం ● రేపటి నుంచి 26వ తేదీ వరకు జాతర ● వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తజనం

జాతరకు ఏర్పాట్లు పూర్తి

● జాతరకు ముస్తాబైన ఉసిరికాయలపల్లి ఆలయం ● రేపటి నుంచి 26వ తేదీ వరకు జాతర ● వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తజనం

కారేపల్లి: ఏటా మాదిరిగానే దసరా సందర్భంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయంలో జాతర వైభవంగా జరగనుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యాన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్న కోటమైసమ్మ తల్లి జాతర ఈనెల 20నుంచి 26వ తేదీ వరకు జరగనుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూ బాబాద్‌ జిల్లా నుంచి వేలాదిగా భక్తజనం తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ప్రభబండ్లు కట్టుకొని ఊరేగింపుగా చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

భక్తులకు సౌకర్యాలు

జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్‌ సమస్య ఎదురుకాకుండా పర్యవేక్షించేందుకు ఖమ్మం రూర ల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 10మంది ఎస్‌ఐలు, 100మంది కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పా ట్లు చేయనున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కోసం సింగరేణి మండల పరిషత్‌ ఆధ్వర్యంలో ఆరు వాటర్‌ ట్యాంకులు సమకూరుస్తారు. ఇక పారిశుద్ధ్య పనులకు 12మంది కార్మికులను కేటాయించగా రెండు జీపీల కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. రాత్రి వేళ విద్యుత్‌ సరఫరా సాఫీగా సాగేలా 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా త్రీ ఫేస్‌ సరపరా చేయనున్నారు. ఇక ఖమ్మం నుంచి కారేపల్లి, ఉసిరికాయలపల్లి మీదుగా ఇల్లెందు బస్సులు పడనుండగా, వన్‌వే అమలుకు నిర్ణయించారు.

సర్కస్‌, షాపులు

జాతరకు వచ్చే పిల్లలు, పెద్దలకు ఆనందాన్ని ఇచ్చేలా ప్రాంగణంలో వివిధ ప్రాంతాలకు చెందిన సర్కస్‌లు ఏర్పాటుచేశారు. జాయింట్‌ వీల్‌, క్రాస్‌ వీల్‌, కొలంబో, టవర్‌ రైడర్‌, డాన్సింగ్‌ డాల్‌, ధూమ్‌ ట్రైన్‌ వంటివి ఇందులో ఉన్నాయి. ఇక ఆట బొమ్మలు, గృహోపకరణ వస్తువులు, తినుబండరాల అమ్మకానికి ఇప్పటికే షాపులు ఏర్పాటయ్యాయి. ఈమేరకు ఆలయ ఈఓ కొండకింది కట్టుకూరు వెంకటయ్య, పర్సా ట్రస్టు చైర్మన్‌ పర్సా పట్టాభిరామారావు ఆధ్వర్యాన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కోటమైసమ్మ తల్లి జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవాదాయ ధర్మదాయ శాఖ, పర్సా ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఏటా మాదిరిగానే ఈసారి కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశాం. తల్లిని దర్శించుకునేలా క్యూలైన్ల ఏర్పాటు చేయడమే కాక తాగునీరు సమకూర్చనున్నాం. అత్యవసర వైద్యానికి జాతర ప్రాంగణంలో హెల్త్‌ క్యాంప్‌ కూడా ఉంటుంది.

– పట్టాభిరామారావు, పర్సా ట్రస్టు చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement