ప్రమాదకరంగా కేటీపీఎస్‌ కెనాల్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా కేటీపీఎస్‌ కెనాల్‌

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

● రక్షణ లేకపోవడంతో నీటమునిగి పలువురి మృతి ● రెండు రోజుల క్రితం కొత్తగూడేనికి చెందిన ఇద్దరు మృత్యువాత ● రక్షణ చర్యలపై నిర్లక్ష్యం వీడని కేటీపీఎస్‌ యాజమాన్యం

కొన్ని ఘటనలను పరిశీలిస్తే..

ఇనుపకంచె ఏర్పాటు చేయాలి

ప్రతిపాదనలు పంపుతాం

● రక్షణ లేకపోవడంతో నీటమునిగి పలువురి మృతి ● రెండు రోజుల క్రితం కొత్తగూడేనికి చెందిన ఇద్దరు మృత్యువాత ● రక్షణ చర్యలపై నిర్లక్ష్యం వీడని కేటీపీఎస్‌ యాజమాన్యం

పాల్వంచరూరల్‌: కేటీపీఎస్‌ కాలువ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఏటా ఇద్దరు, ముగ్గురిని బలిగొంటోంది. గత నాలుగైదేళ్లలో సుమారు 15 మంది ప్రాణాలు తీసింది. అయినా కేటీపీఎస్‌(జెన్‌కో) అధికారులు కాలువకు ఇరువైపులా రక్షణ చర్యలు చేపట్టడంలేదు. రెండు రోజుల క్రితం కూడా కొత్తగూడేనికి చెందిన ఇద్దరు యువకులు ఈతకు దిగి కాలువలో మునిగి మృత్యువాత పడ్డారు.

విద్యుదుత్పత్తి కోసం కాలువ ఏర్పాటు

విద్యుదుత్పత్తి కోసం అవసరమైన నీటిని కిన్నెరసాని ప్రాజెక్ట్‌ నుంచి కేటీపీఎస్‌కు కాలువ ద్వారా తరలిస్తున్నారు. ప్రాజెక్ట్‌ నుంచి కరకవాగు వరకు సుమారు పది కిలోమీటర్ల పొడవున కాలువ ఉండగా, రోజూ 120 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. కాలువ ప్రమాదకరంగా ఉన్నా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడంలేదు. కాలువ పక్కనే కరకవాగు, గాజులగూడెం, దుబ్బతండా, కాల్వతండా, పూసలతండా గిరిజన గ్రామాలు ఉన్నాయి. నీటిని పంటలకు ఉపయోగించుకునేందుకు కొందరు రైతులు, బట్టలు ఉతుక్కునేందుకు మహిళలు కాలువలోకి దిగుతుంటారు. కాలువపై మొద్దు ఏర్పాటు చేసుకుని అవతలివైపు ఉన్న ఇళ్లకు రాకపోకలు సాగిస్తుంటారు. వేసవికాలం, హోలీ పండుగ వచ్చిందంటే పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల నుంచి వందల సంఖ్యలో యువకులు, విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు వస్తారు. ఈ క్రమంలో అవగాహన లేక, నీటి ప్రవాహ ఉధృతి అంచనావేయలేక, ఈత రాక పలువురు కాలువలో మునిగి మృతి చెందుతున్నారు. గాజులగూడెం వద్ద కాలువ ఎదుట ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. కాలువలో మొసళ్లు కూడా సంచరిస్తున్నాయి.

గస్తీ ఏర్పాటు చేయాలి

ములకలపల్లి మండలం మాదారం పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఇదే కాలువలో పడి మృతి చెందగా అక్కడ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కరవాగు వద్ద కూడా గతంలో రెండు మూడు ప్రమాదాలు చోటుచేసుకోగా, ఇనుప కంచె నిర్మించారు. ఇదే తరహాలో కాలువ పొడవునా ఇరువైపులా ఇనుపకంచె నిర్మించాలని పలువురు కోరుతున్నారు. కేటీపీఎస్‌ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కేటీపీఎస్‌ అధికారులు కాలువ పొడవునా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కొందరు పట్టించుకోకుండా కాలువలో దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలని గతంలో కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కేటీపీఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశించారు. అయినా కేటీపీఎస్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వీడటంలేదు.

లక్ష్మీదేవిపల్లి మండలం సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన జక్కినబోయిన అనిల్‌కుమార్‌, ఎస్‌డీ సోహెబ్‌పాషా గాజులగూడెం వద్ద కాలువలో ఈతకు దిగి మృత్యువాతపడ్డారు. పాల్వంచ గట్టాయిగూడేనికి చెందిన గుండా పుష్పలత, మంచికంటినగర్‌కు చెందిన దివ్యాంగుడైన రాములు కిన్నెరసాని డీర్‌ పార్కు వద్ద కాలువలో పడి మృతి చెందారు. గాజులగూడెం వద్దే సిద్దుల రక్షిత్‌ అనే 11 ఏళ్ల బాలుడు కూడా మృతి చెందాడు. గత ఆగస్టు 2న కొత్తగూడేనికి చెందిన తంగళ్లపల్లి సంతోష్‌ కెనాల్లో పడి చనిపోయాడు. శనివారం కొత్తగూడెంలోని రామవరానికి చెందిన తుడుం భరత్‌, పంజాబ్‌గడ్డకు చెందిన ఎస్‌కె.సమీర్‌ గాజులగూడెం వద్ద కాలువలో పడి మృతిచెందారు.

కరకవాగు నుంచి కేటీపీఎస్‌ ప్రాజెక్ట్‌ వరకు కాలువకు ఇనుప కంచె ఏర్పాటు చేసేలా కేటీపీఎస్‌ అధికారులతో మాట్లాడుతాం. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. యువకులు ఈతకు నీటిలో దిగి ప్రమాదాలకు గురికావొద్దు.

–సతీష్‌కుమార్‌, డీఎస్పీ పాల్వంచ

కాలువలో దిగకుండా అవగాహన కల్పించడంతోపాటు అక్కడక్కడా ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నాం. అయితే కొందరు ఆ కంచెను తొలగిస్తున్నారు. సిబ్బంది ద్వారా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. కాలువ పొడవునా రక్షణ చర్యలకు అంచనాలు రూపొందించి జెన్‌కోకు పంపిస్తాం.

–ప్రభాకర్‌రావు, కేటీపీఎస్‌ 5వదశ సీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement