జిల్లావ్యాప్తంగా సద్దుల సంబురం
ఘనంగా ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు
చివరిరోజు ఊరూవాడ హోరెత్తిన వేడుకలు
సద్దుల సంబురం అంబరాన్నంటింది. అంతటా కోలాహలం నెలకొంది. బతుకమ్మ వేడుకతో ఇంటింటా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఆడబిడ్డలు తీరొక్క పూలు సేకరించి బతుకమ్మను పేర్చారు. కొత్త వస్త్రాలు ధరించి ఇళ్లలో గౌరమ్మకు పూజలు చేశారు. బతుకమ్మలతో ఊరేగింపుగా బయల్దేరి చౌరస్తాలు, ఆలయాలకు చేరుకున్నారు. చూడచక్కని బతుకమ్మలను కూడళ్లలో ఉంచి ఆడిపాడారు. చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ జానపదాలు ఆలపించారు. కోలాటాలు, డీజేలతో సందడి చేశారు. రాత్రి వరకు వేడుకలు నిర్వహించి జలాశయాలు, వాగుల్లో నిమజ్జనం చేశారు. పోయిరావమ్మా.. మళ్లీ రావమ్మా అంటూ బతుకమ్మకు వీడ్కోలు పలికారు.


