ఐశ్వర్యలక్ష్మిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యలక్ష్మిగా అమ్మవారు

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

భద్రాచలం: అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని భక్తులను ఆశీర్వదించే జగన్మాత ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతుండగా, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మారుతి సదనంలో వేద పండితులు, అర్చకులు రామాయణ యుద్ధకాండ పారాయణం చేశారు. కాగా, సోమవారం అమ్మవారు వీరలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వైభవంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రగిరి దేవస్థానంలో ఆదివారం స్వామివారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భాలయంలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించిన అనంతరం బేడా మండపంలో నిత్యకల్యాణ క్రతువును ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

విజయదశమికి ఏర్పాట్లు

విజయదశమి సందర్భంగా ఈ నెల 21న దేవస్థానంలో విజయోత్సవం, శమీపూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ నెల 26న పౌర్ణమి సందర్భంగా శబరి స్మృతి యాత్ర కూడా నిర్వహించనున్నారు.

ఆలయంలోనే రామ్‌లీలా విజయోత్సవం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 21న నిర్వహించే రామ్‌లీలా విజయోత్సవంలో మార్పులు చేసినట్లు ఈఓ కె. దామోదర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా ఉదయం కల్యాణం, పట్టాభిషేకం, సాయంత్రం శమీ పూజలను ఆలయంలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్వామివారి పాదుకలు, రామజ్యోతిని జమ్మి మండపానికి తీసుకెళ్లి సాయంత్రం 6 గంటలకు రామ్‌లీలా ఉత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement