● జీఎస్టీ సాకుతో చెల్లించని కాంట్రాక్టర్లు ● పండుగ పూట ఎదురుచూస్తున్న కార్మికులు
రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 1,754 కోట్ల లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా ప్రకటించింది. పర్మనెంట్ కార్మికులకు ఒక్కొక్కరికి సుమారుగా రూ.1.53 లక్షలను ఈ నెల 16న చెల్లించింది. కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5,500 చొప్పున ప్రకటించింది. సంస్థవ్యాప్తంగా ఉన్న 12 ఏరియాల కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన నగదు వారికి వేతనాలు చెల్లించే కాంట్రాక్టర్లలో ఖాతాల్లో జమ చేసింది. ఆ నగదు తాము కార్మికులకు చెల్లించాలంటే రూ. లక్ష వరకు జీఎస్టీ భారం పడుతుందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. సింగరేణి యాజమాన్యం వాటా నగదు మాత్రమే జమ చేసిందని చెబుతున్నారు. జీఎస్టీకి సంబంధించిన నగదు కూడా జమ చేస్తేనే తాము కార్మికులకు చెల్లిస్తామని పేర్కొంటున్నారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు పండుగపూట లాభాల వాటా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కేవలం కమీషన్ రావటంలేదనే సాకుతో కాంట్రాక్టర్లు లాభాలవాటా చెల్లింపులో జాప్యం చేస్తున్నారు. ఇది సరైన విధానంకాదు. సింగరేణి యాజమాన్యం డైరెక్ట్‌గా కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాల్లో వాటా జమ చేస్తే బాగుండేది. దసరా పండుగ వేళ ఇబ్బందులు తప్పేవి.
–ఎన్.సంజీవ్, ఇఫ్టూ రీజియన్ కార్యదర్శి


