ఆది నుంచీ ఆటంకాలే! | - | Sakshi
Sakshi News home page

ఆది నుంచీ ఆటంకాలే!

Oct 17 2026 12:28 AM | Updated on Oct 17 2026 12:28 AM

● బీటీపీఎస్‌లో తరచూ అవాంతరాలు, మరమ్మతులు ● మూడో యూనిట్‌ మూడు వారాలుగా షట్‌డౌన్‌ ● ప్లాంట్‌లో నిలిచిన 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ● యాదాద్రి తరహాలో భద్రాద్రిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని విన్నపం

కష్టం.. నష్టం..

● బీటీపీఎస్‌లో తరచూ అవాంతరాలు, మరమ్మతులు ● మూడో యూనిట్‌ మూడు వారాలుగా షట్‌డౌన్‌ ● ప్లాంట్‌లో నిలిచిన 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ● యాదాద్రి తరహాలో భద్రాద్రిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని విన్నపం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. ఓవైపు యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ స్థాపిత సామర్థ్యం మేరకు పనిచేయడంలేదు. మరోవైపు భద్రాద్రి ప్లాంట్‌లో సాంకేతిక చిక్కులు పదేపదే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం బీటీపీఎస్‌లో నాలు గు యూనిట్లలో మూడే పనిచేస్తున్నాయి. సాంకేతిక కారణాలతో ఓ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి జరగడం లేదు. ఈ నేపథ్యంలో యాదాద్రి తరహాలోనే భద్రాద్రిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రారంభించిన ఏడు నెలలకే విపత్తు

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ఆరంభించిన ఏడు నెలలకే పెను విపత్తును చవి చూసింది. 2022 జూలైలో గోదావరికి రికార్డు స్థాయిలో వచ్చిన వరద ప్లాంటును చుట్టుముట్టింది. అధికారులు అప్పటికప్పు డు అప్రమత్తం కావడంతో ప్లాంటులో కీలక విడి భాగాలు ముంపునకు గురికాలేదు. కానీ ప్లాంటు భద్రతా ప్రమాణాలను ఎత్తి చూపినట్లయింది. 2024 జూన్‌ 29న ప్లాంట్‌లోని యూనిట్‌ వన్‌పై పిడుగుపడటంతో కీలకమైన ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. దీంతో దాదాపు ఏడాదిపాటు ఒకటో యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

తాజాగా యూనిట్‌–3లో మరమ్మతులు

బీటీపీఎస్‌ యూనిట్‌–3లో కీలకమైన రోటర్‌ ఎగ్జాస్టర్‌ పరికరం సెప్టెంబర్‌ ఆఖరి వారంలో పాడైంది. సాధారణ మరమ్మతులకు ప్రయత్నించినా సఫలం కాలేదు. దీంతో మూడు వారాలుగా యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయింది. సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యయం అయ్యే పరికరానికి రిపేర్‌ చేయాలా? లేక కొత్తది కొనుగోలు చేయాలా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలే దు. రిపేరు చేయాలంటే ఉత్తరాఖండ్‌లోని హరి ద్వార్‌లో ఉన్న భెల్‌ ఆఫీసు నుంచి నిపుణులను రప్పించాలి. లేదా యంత్రాన్ని అక్కడకు తీసుకెళ్లాలి. ఈ నేపథ్యంలో మళ్లీ విద్యుత్‌ ఉత్పత్తి జరగాలంటే నాలుగు వారాల సమయం పట్టే అవకాశముంది.

తెలంగాణ వచ్చాక

తెలంగాణ వచ్చాక విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మణుగూరు వద్ద 270X4 =1080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి ప్లాంట్‌ నిర్మాణానికి 2015లో శ్రీకారం చుట్టారు. 2022 జనవరి నాటికి నాలుగు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్లాంట్‌ను సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో కట్టడం, నిర్మాణ పనులు నామినేషన్‌ పద్ధతిపై భెల్‌కు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ అంశాలపై జస్టిస్‌ నర్సింహారెడ్డి అధ్యక్షతన కమిటీ వేసినా.. ఆ తర్వాత ఎటువంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టలేదు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతోంది. పగటి వేళ కూడా ఏసీలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌లో సైతం రబీ తరహాలో మోటార్లతో పంటలకు సాగునీరు అందించాల్సి వస్తోంది. ఇంతటి కీలక సమయంలో బీటీపీఎస్‌ యూనిట్‌–3 దాదాపు నెల రోజులపాటు షట్‌డౌన్‌లో ఉండటం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసింది. బీటీపీఎస్‌ నాలుగు యూనిట్లలో 1080 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగితే 26 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ రాష్ట్ర అవసరాలకు అక్కరకు వస్తుంది. ప్రస్తుతం ఒక యూనిట్‌ ఆగిపోవడంతో 5.15 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ తగ్గిపోయింది. పైగా భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. ప్రస్తుతం నష్టపోతున్న స్థాయిలో విద్యుత్‌ను బయటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినా, ఇతర ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసినా సర్కారు ఖజానాపై అదనపు భారం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement