● శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు ● భక్తులతో భద్రగిరిలో సందడి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. శుక్రవా రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధాన్యలక్ష్మి రూపంలో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అర్చకులు కుంకుమార్చన చేపట్టారు. మరోవైపు మారుతి సదనంలో వేద పండితులు, అర్చకులు కిష్కింధకాండ పారాయణం చేశా రు. కాగా శనివారం అమ్మవారి విజయలక్ష్మి రూపంలో దర్శనమివ్వనున్నారు.
సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణోత్సవం
దేవస్థానంలో తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలను నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణోత్సవం కోసం రామసేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలు, పూజలు, రామాయణ పారాయణం, నిత్యకల్యాణోత్సవం, దసరా సెలవులతో భద్రాచలం దేవస్థానంలో సందడి నెలకొంది.


