99 పోస్టులు.. 4వేల దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

99 పోస్టులు.. 4వేల దరఖాస్తులు

Oct 17 2026 12:28 AM | Updated on Oct 17 2026 12:28 AM

● వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పోస్టులకు పోటాపోటీ ● ఇదే అదునుగా రంగంలోకి దళారులు

● వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పోస్టులకు పోటాపోటీ ● ఇదే అదునుగా రంగంలోకి దళారులు

ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. గైనకాలజీ, అనస్తీషియా, యూరాలజీ, పాథాలజీ, పీడీయాట్రిక్‌ వైద్యులు ఆరుగురు, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, సీహెచ్‌ఓలు, ఎంఓలు కలిపి 36 పోస్టులు, స్టాఫ్‌నర్సులు 24, ఏఎన్‌ఎంలు 11, ల్యాబ్‌ టెక్నీషియన్లు 14, ఇతరత్రా అన్నీ కలిపి 99 పోస్టుల కోసం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తు చేసుకునే గడువు 13వ తేదీతో ముగియగా అభ్యర్థులు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి క్యూ కట్టడంతో అధికారులు నివ్వెరపోయారు. దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఉద్యోగులకు తలకు మించిన భారంలా మారింది.

అత్యధికం స్టాఫ్‌నర్సులకు..

జిల్లాలో వివిధ పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాలు, పట్టణ దవాఖానాల్లో 99 పోస్టులు భర్తీ చేయనుండగా, మొత్తం 4 వేలకు పైగా దరఖాస్తులు అందడం గమనార్హం. ఇందులో అత్యధికంగా 24 స్టాఫ్‌నర్సుల పోస్టులకు 1,412, మొదటి, సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టులకు 1,053 దరఖాస్తులు అందాయి. అలాగే, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 643, ఫార్మసిస్ట్‌ పోస్టులకు 320, ఎంఎల్‌హెచ్‌పీ 279, వైద్యుల పోస్టులకు 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైద్యుల పోస్టులకు రూ.2,500, ఇతర పోస్టులకు రూ.500 నుంచి రూ.1,500 దరఖాస్తు ఫీజు నిర్ణయించగా మొత్తం 4వేల దరఖాస్తులు అందడంతో వైద్య, ఆరోగ్య శాఖకు ఆదాయం భారీగానే సమకూరింది. కలెక్టర్‌ చైర్మన్‌గా కొనసాగే కమిటీ ద్వారా ఎంపిక జరగనుంది.

అంతా మేం చూస్కుంటాం...

వైద్య, ఆరోగ్య శాఖలో చాలా ఏళ్ల తర్వాత కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ క్రమాన పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో దళారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అసలే ఉద్యోగం లేని పరిస్థితిలో ఎంతో కొంత డబ్బు చెల్లిస్తే తమకు దక్కుతుందనే ఆశతో నిరుద్యోగులు దళారుల వలలో పడుతున్నట్లు తెలిసింది. మెరిట్‌ ఆధారంగానే పోస్టులు భర్తీ ఉంటుందని అధికారులు చెబుతుండగా.. కార్యాలయంలోని ఒకరిద్దరు ఉద్యోగుల ద్వారా దరఖాస్తుదారుల ఫోన్‌ నంబర్లు సేకరిస్తూ దళారులు సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామారావు మాట్లాడుతూ నిరుద్యోగులెవరూ దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. పోస్టుల భర్తీ పారదర్శకంగా ఉంటుందని, కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న కమిటీ నియామకాలు జరుగుతాయని తెలిపారు. వంద శాతం మెరిట్‌కే ప్రాధాన్యత ఇవ్వనున్నందున ఎవరికీ డబ్బు చెల్లించి మోసపోవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement