మణుగూరు టౌన్: మణుగూరులోని పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన వినాయకుడి చేతిలో లడ్డూలను బుధవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా బులియన్ మర్చంట్ గణేశ్ మండపంలోని లడ్డూను నీరజ జ్యూయెలరీ యజమాని కంచర్ల శ్రీనివాస్ రూ.3,47,116 కు దక్కించుకోగా, చాంబర్ ఆఫ్ కామర్స్ లడ్డూను రూ.51వేలకు వందనపు వాసు గెలుచుకున్నారు.
గణనాథుడి లడ్డూ రూ.1,00,116
అశ్వాపురం: మండలంలోని మొండికుంటలో రామాలయం వద్ద ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుడి చేతిలోని 36 కేజీల లడ్డూకు బుధవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ చలమల్ల శివారెడ్డి రూ.1,00,116కు కై వసం చేసుకున్నారు. ఇది మండలంలోనే అత్యధిక ధర అని నిర్వాహకులు తెలిపారు.
‘తాలిపేరు’లోకి
పెరుగుతున్న వరద
చర్ల: మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన తాలిపేరులోకి వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం రాత్రి 10 గంటలకు నుంచి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ఉధృతి చేరుతుండడంతో 25 గేట్లలో ఆరింటిని రెండేసి అడుగుల చొప్పున ఎత్తి 8,198 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74మీటర్లు కాగా, వరద కారణంగా 73.40 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఇటు తెలంగాణతో పాటు ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి మరింతగా వరద చేరే అవకాశముందని సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ప్రాజెక్టు డీఈ తిరుపతి తెలిపారు.
సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు
భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆబ్జెక్టివ్, ఆప్టిట్యూడ్ స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం 91210 87421, 62817 66534 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
గిరిజన యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ
ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు 3 – 4 నెలల పాటు ఉచిత ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం వైటీసీల్లో టైలరింగ్, బ్యూటీ థెరపిస్ట్, కంప్యూటర్ హార్డ్‌వేర్, డ్రోన్ టెక్నీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 93474 66615, 81061 41505 నంబర్లలో సంప్రదించవచ్చని పీఓ వెల్లడించారు.
బతికి ఉండగానే
డెత్ సర్టిఫికెట్ !
ఫోర్జరీ పత్రాలతో ఆస్తుల బదలాయింపు
ఇల్లెందు: ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు మున్సిపాలిటీ కాస్త పలుకుబడి ఉంటే చాలు ఏదైనా సాధ్యమనేనన్న ప్రచారాన్ని నిజం చేసే మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బతికే ఉన్న వ్యక్తి పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ చేయగా.. ఫోర్జరీ పత్రాలతో ఆ వ్యక్తి ఆస్తులను బదలాయించుకున్న ఘటన ఇది. ఇల్లెందు నంబర్ –2 బస్తీ 7వ వార్డుకు చెందిన బొల్లం రాములు పేరుతో 1–5–159/1 నంబర్ కలిగిన ఇల్లు ఉంది. అయితే, సరిత అనే మహిళ రాములు మృతి చెందినట్లు హైదరాబాద్ నుంచి డెత్ సర్టిఫికెట్, ఆపై ఇల్లెందు తహసీల్ నుంచి ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుని మరికొన్ని ఫోర్జరీ పత్రాలతో రాములు ఇంటిని తన పేరిట మార్పించుకుంది. అంతేకాక పేరు మార్పిడి కూడా చేయించుకుంది. కొన్నాళ్ల క్రితం రాములు మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లించేందుకు వెళ్లగా ఆయన పేరుతో ఇల్లే లేదని చెప్పడంతో విషయం వెలుగు చూసింది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఎటూ తేలకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. అయితే, అమ్మకం, పేరు మార్పిడికి సమర్పించిన పత్రాలన్నీ ఫోర్జరీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ కమిషనర్ సందీప్‌ను వివరణ కోరగా ఇప్పటి వరకు విషయం తమ దృష్టికి రాలేదని, అయినా పరిశీలన చేస్తామని తెలిపారు.


