రెండు రోజుల పాటు వేడుకలు..
మూడు వేల విగ్రహాలు వస్తాయని అంచనా
రూట్ మ్యాప్ లేక భక్తుల ఇబ్బందులు
200 మంది పోలీసులతో బందోబస్త్
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదీతీరంలో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నిమజ్జనాన్ని గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి సుమారు మూడు వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి రెండు క్రేన్లను, ఏపీ నుంచి రెండు లాంచీలను సిద్ధం చేశారు. సహాయక సిబ్బంది, 15 మంది గజ ఈతగాళ్లను నియమించారు. కరకట్ట, నిమజ్జన ప్రాంతంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి, నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లను సిద్ధంగా ఉంచారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్ల వెంట శుభ్రత పనులు నిర్వహించడంతోపాటు బ్లీచింగ్ చల్లిస్తున్నారు.
రెండు చోట్ల పార్కింగ్...
నిమజ్జనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం పట్టణంలో మూడు చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. రామాలయం సమీపంలో, ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో వాహనాలను నిలిపేలా ఏర్పాట్లు చేశారు. జూనియర్ కళాశాల నుంచి సీఆర్‌పీఎఫ్ క్యాంపు వరకు యూటర్న్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
రూట్ మ్యాప్ లేక ఇబ్బందులు..
నిమజ్జనానికి విగ్రహాలను తీసుకొచ్చే నిర్వాహకులు పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వివరాలు నమోదు చేసుకుని టోకెన్ తీసుకోవాలని, సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే నిమజ్జన ప్రాంతానికి చేరుకోవాలని అధికారులు తెలిపారు. భద్రాచలానికి ఇప్పటికే సుమారు 300లకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. ఎక్కడా రూట్ మ్యాప్‌కు సంబంధించిన గుర్తులను ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు విగ్రహాలను తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పోలీసుల ఆంక్షలు ..
నిమజ్జన ప్రదేశంలో డీజేలు, బాణాసంచా వినియోగాన్ని నిషేధించారు. కరకట్టపైకి వాహనాలను తీసుకురావొద్దని, బ్రిడ్జిపై నుంచి నిమజ్జనం నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. విగ్రహాన్ని తీసుకొచ్చే వాహనంతో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గోదావరిలో వరద నీరు అధికంగా ఉన్నందున నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. భద్రాద్రి ప్రాంతంలోని వైన్స్‌షాపులను గురువారం మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
నిమజ్జనం సందర్భంగా సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో నిమజ్జన కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలి
– అరుణ్‌కుమార్, డీఎస్పీ, భద్రాచలం


