● పంట మార్పిడి చేయాలని అవగాహన కార్యక్రమాలు ● ప్రకృతి వైపరీత్యాలతో ఆర్థికంగా నష్టపోతున్న రైతులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. వరి మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలే కాకుండా నూనె గింజలు, అపరాలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరలు, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని చెబుతున్నారు. అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉద్యాన పంటలకు రాయితీలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు అమ్మకాల సందర్భంలో కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికి పోతున్నారు. నకిలీ విత్తనాలు, చీడపీడలు పంటలను ఆశించడంతో నష్టపోతున్నారు. నూనె పంటలకు, పప్పు ధాన్యాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆ దిశగా రైతులు ఆలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనేక సందర్భాల్లో సూచించారు. రైతులు కొంతమేర ఆయిల్‌పామ్‌పై వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో సాగు భూమి 6,13,702.43 ఎకరాలు ఉండగా, ప్రతీ వానాకాల సీజన్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వేసవి సీజన్‌లో నీటి వనరులు ఉన్న చోట మాత్రమే పంటలు వేస్తున్నారు. గత వానాకాలంలో 491 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, ఇతర పంటలు 10,012 ఎకరాలు, పొద్దుతిరుగుడు 414 ఎకరాలు, పెసర 388 ఎకరాలు, మినుములు 1,599 ఎకరాలు, వేరుశెనగ 2,168 ఎకరాల్లో సాగు చేశారు. నూనె, పప్పు ధాన్యాల పంటలు కలిపినా కనీసం 20 వేల ఎకరాల్లో కూడా సాగు చేయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా ప్రజల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
ఉద్యాన పంటల రాయితీలను వినియోగించుకుని రైతులు పంట మార్పిడి చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. కొందరు ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యం చేస్తున్నాం.
– జంగా కిషోర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులు ఆర్థిక పరిపుష్టి చెందుతారు. ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎక్కువ శాతం మంది రైతులు సంప్రదాయ పంటలనే పండిస్తున్నారు.
– వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి


