నిరంతరం సరఫరా చేయాలి
మా దృష్టికి రాలేదు
● పక్కదారి పడుతున్న గృహ వినియోగ సిలిండర్లు ● యథేచ్ఛగా, అధిక ధరలతో వాణిజ్య అవసరాలకు.. ● భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులపై అదనపు భారం ● నిద్రమత్తులో పౌరసరఫరాల శాఖ అధికారులు
చిన్న, పెద్ద హోటళ్ల అసోసియేషన్లు గ్యాస్ డీలర్లను సంప్రదిస్తే కమర్షియల్ గ్యాస్ కొరత ఉందనే సమాధానం చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా 5 కేజీల సిలిండర్లు తీసుకెళ్లండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. పోనీ అవి తీసుకెళ్దామంటే ఖాళీ సిలిండర్లు కావాలంటున్నారు. డిపాజిట్ చెల్లిస్తామని చెప్పినా 5 కేజీల సిలిండర్లు ఇవ్వడం లేదని హోటల్ యజమానులు వాపోతున్నారు. ఇప్పటివరకు తాము వినియోగించకుండా ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని ప్రశ్నిస్తున్నారు.
భద్రాచలం: పశ్చిమాసియా యుద్ధం పేరుతో గ్యాస్ కొరత చూపించి జిల్లాలో ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను బ్లాక్ చేస్తున్నా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో సాధారణ ప్రజల వంట కష్టాలు రెట్టింపయ్యాయి. భద్రాచలం దివ్యక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులపై అదనపు భారం పడుతోంది.
దొడ్డిదారిన లెక్కకు మించి..
మార్చిలో శ్రీరామనవమి నాటికే గ్యాస్ కొరత నెలకొంది. భక్తులు, పర్యాటకులు కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని ముందస్తుగా సాక్షి కథనాలను ప్రచురించింది. దీంతో స్పందించిన జిల్లా పౌరసరఫరా శాఖాధికారులు కలెక్టర్‌తో చర్చించి ఉత్సవాల సమయంలో తాత్కాలికంగా కమర్షియల్ గ్యాస్ అందించారు. ఉత్సవాలు ముగిశాక మళ్లీ పరిస్థితి యథాస్థితికి వచ్చింది. ఏప్రిల్ నుంచి కమర్షియల్ గ్యాస్ సరఫరా లేదంటూ ఆపి వేశారు. దీంతో గృహవినియోగ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇందులో డెలివరీ బాయ్స్ నుంచి డీలర్ల వరకు వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.5 కేజీలు) ధర సుమారు రూ. వెయ్యి లోపుఉండగా, అక్రమ మార్గంలో కేజీకి రూ.230 చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే 14.2 కేజీలకు సుమారు రూ.3వేలు దోచుకుంటున్నారు. దొడ్డిదారిన లెక్కకు మించి సిలిండర్లు విక్రయిస్తున్నారు. ఇక ప్రైవేట్ కంపెనీకి చెందిన 19.2 కేజీల సిలిండర్ గతంలో రూ.1600 ఉండగా, ప్రస్తుతం రూ.4,200 వసూలు చేస్తున్నారు.
భక్తులపై భారం
కొరత, బ్లాక్ దందాతో గ్యాస్ ధర రెండింతలు కావడంతో కొందరు హోటళ్ల యజమానులు టిఫిన్ ధర కూడా పెంచారు. 10 నుంచి 20 శాతం వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. దీంతో భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు భారంగా మారింది. ఇక చిన్న హోటళ్ల నిర్వాహకులు ధరలను పెంచకుండా టిఫిన్ సైజ్ తగ్గించి అమ్ముతున్నారు. కొందరు గ్యాస్ అధికంగా వినియోగించే మెనూ ఐటెమ్స్ తగ్గిస్తున్నారు. పలుకుబడిలేని, పైరవీలు చేయించలేని, బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ కొనలేని మరికొందరు తమ వ్యాపారాలను నిలిపివేశారు. ప్రస్తుతం పాఠశాలలకు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఉంటోంది. ఈ సమయంలోనైనా కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో నిరంతరాయంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
హెచ్‌పీ గ్యాస్ అవసరాలకు తగినట్లు సరఫరా చేయటం లేదు. దీంతో ప్రైవేట్ గ్యాస్‌ను వినియోగించాల్సివస్తోంది. గ్యాస్ ధర రెండింతలు కావడంతో టిఫిన్ రేటు పెంచాల్సి వచ్చింది. కమర్షియల్ గ్యాస్ ఇస్తే మేమూ ధరలు తగ్గిస్తాం.
– జిల్లా శ్రీనివాస్, హోటల్స్ అసోసియేషన్
సెక్రటరీ, భద్రాచలం
బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయిస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. కమర్షియల్ గ్యాస్ కొరతపై వివరాలు తెలుసుకుని, నిరంతర సరఫరాకు గ్యాస్ ఏజెన్సీలతో చర్చిస్తాం.
– ప్రేమ్‌కుమార్,
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి


