అటానమస్ ఇస్తే..
స్వయం ప్రతిపత్తితో
సత్వర అభివృద్ధి
● భద్రగిరి రామాలయ అభివృద్ధికి అవకాశం ● తాజాగా వేములవాడకు ఇవ్వాలని ప్రభుత్వ యోచన ● భద్రాచలానికీ స్వయం ప్రతిపత్తి కల్పించాలని భక్తుల విన్నపం
భద్రాచలం: రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి నిధులు విడుదల చేయడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఆలయానికి అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా కల్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలని జీఓ జారీ చేసింది. ఈ క్రమంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి కూడా అటానమస్ హోదా కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబాటు
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దివ్యక్షేత్రానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. ఆలయం రామాయణ ఇతిహాసంతో ముడిపడి ఉండటంతోపాటు తహసీల్దార్‌గా ఉన్న భక్త రామదాసు ప్రాణత్యాగానికి సిద్ధపడి నిర్మించాడు. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రగిరికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పవిత్ర గోదావరి చెంతనే ఉండటంతో కార్తీక మాసం పూజలు, హనుమాన్ జయంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. కానీ దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. భక్త రామదాసు నాటి ప్రధాన ఆలయానికి కొద్దిపాటి మార్పులే చేపట్టారు. అంతకుమించి అభివృద్ధి పనులు, భక్తులకు వసతుల కల్పన పనులు చేపట్టలేదు. ఆలయ ఆదాయంలో అత్యధికం నిర్వహణకే సరిపోతుండగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడంలేదు. దీంతో అభివృద్ధి ముందుకు సాగడం లేదు.
పాలకమండలిని కూడా నియమిస్తే..
భద్రాచల క్షేత్రానికి చివరి పాలకవర్గం 2010, నవంబర్ 26 నుంచి 2012 నవంబర్ 25 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆలయ పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో, మళ్లీ 2025 నవంబర్‌లో నోటిఫికేషన్లు జారీ చేశారు. రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించారు. రెండోసారి దరఖాస్తులు స్వీకరించి నాలుగు నెలలు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగడంలేదు. పాలకవర్గాన్ని నియమిస్తే ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. త్వరలో శ్రీరామనవమి, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు–2027 జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాలకవర్గ నియామకం, అటానమస్ హోదా ప్రకటిస్తే ఉత్సవాలు విజయవంతం చేయడంతోపాటు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భక్తులు పేర్కొంటున్నారు.
భద్రగిరికి అటానమస్ హోదా లభిస్తే సొంత నిర్ణయాధికారం వస్తుంది. దీంతో స్థానిక అవసరాలకు తగినట్లు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకునేలా భాగస్వామ్యం చేయొచ్చు. ఆర్థిక వనరులపై స్పష్టమైన నియంత్రణ, నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటుంది. భక్తుల సౌకర్యాలు, వసతిలపై ప్రత్యక్షంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. గోదావరి తీరం, ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలు, మిథిలా స్టేడియం, కరకట్టతోపాటు భద్రాచలం గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టవచ్చు.
అటానమస్ ఇస్తే..


