వ్యక్తి అనుమానాస్పద మృతి
● హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన వేముల రాము (30) అనుమానాస్పదంగా మృతిచెందడంతో శనివారం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘర్షణకు దారితీసింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాములసింగారం గ్రామానికి చెందిన రాముకు, ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన గౌడిచర్ల మౌనికకు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కలహాల కారణంగా ఆరు నెలల క్రితం భార్యతో కలిసి రాము కొమరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న పని కోసమంటూ వెళ్లిన రాము ఆచూకీ పోలీసుల ద్వారా తెలుసుకొని ఇంటికి తీసుకెళ్లారు. 20న మౌనిక, ఆమె అక్కల కుటుంబాలు కలిసి మేడారం బయలుదేరాయి. వీరు పస్రా చేరుకున్న క్రమంలో అనారోగ్యానికి గురైన రామును అక్కడే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు చేరుస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు నిర్ధారించుకొని తిరిగి కొమరారం బయలుదేరారు. రాము మృతి విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలియచేసి కొమరారం పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లారు. ఎస్‌ఐ నాగుల్‌మీరా సూచనతో రాము భౌతికకాయాన్ని ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇదంతా ఆస్పత్రి వద్ద భార్య మౌనిక బంధువులు రాము కుటుంబ సభ్యులకు వివరించారు. కానీ, వారే హత్య చేసి కట్టుకథలు చెబుతున్నారని రాము కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారించి రాము తండ్రి వెంకన్న నుంచి ఫిర్యాదు తీసుకొని పోస్టుమార్టం నిర్వహించారు. భార్య మౌనికతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కొమరారం ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.
యూరియా చల్లుతూ కూలీ..
అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ, హమాలీ మేసీ్త్ర సామకూరి శంకరయ్య (55) శనివారం ఓ రైతు పొలంలో యూరియా చల్లుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శంకరయ్య పొలంలో యూరియా చల్లుతూ పడిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
విద్యుదాఘాతంతో ఛత్తీస్‌గఢ్ కూలీ..
ఇల్లెందురూరల్: మండలంలోని 21 పిట్ ఏరియా సమీపంలోని జామాయిల్ తోటలో చెట్లు నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురై ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా మక్కావారు గ్రామానికి చెందిన మరకం సోమాను (31) మృతి చెందాడు. మూడు రోజులుగా జామాయిల్ చెట్లు నరుకుతున్న క్రమంలో శనివారం నరికిన చెట్టు హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని తండ్రి మరకం చైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చెరువులో పడి వ్యక్తి ..
ములకలపల్లి: చెరువులో పడి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. దమ్మపేట మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన బండి రాంబాబు (40) ఓ ఫంక్షన్ నిమిత్తం ఇటీవల సుబ్బనపల్లిలో నివసించే సోదరుడు బండి దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చాడు. గురువారం వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాంబాబు తిరిగి రాలేదు. చుట్టుపక్కల విచారించినా జాడ తెలియలేదు. శనివారం ఉదయం గ్రామ శివారులోని చింతలచెరువులో రాంబాబు మృతదేహం బయటపడింది. బహిర్భూమికి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు చెరువుతో పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి భార్య శోభన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సున్నం జయంత్ (22) తండ్రి బాలరాజు గతంలో మృతి చెందగా తల్లి తనను వదిలి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురై ఒంటరితనం భరించలేక శనివారం గ్రామ శివారులో చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బాబాయి సున్నం సతీశ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో ఒకరు..
భద్రాచలంటౌన్: భార్య దూరంగా ఉంటుందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పట్టణంలోని అశోకనగర్ కాలనీకి చెందిన ఇమ్మడి ఇమ్మాన్యుయేల్ (29)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్మాన్యుయేల్ శనివారం ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి


