మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడమే లక్ష్యంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు శిక్షణ ఇచ్చారు. మీ సేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై జిల్లా ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అవగాహన కల్పించారు. మీ సేవ కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీ సేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగం కీలకమని తెలిపారు. యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి, పోర్టల్‌కు అప్‌డేట్ చేయొచ్చని చెప్పారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాల దరఖాస్తులు త్వరితగతిన ఆమోదం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. యాప్ ద్వారా సేకరించిన సమాచారం నేరుగా మీ సేవ పోర్టల్‌కు అనుసంధానమై డేటా తక్షణమే అప్‌డేట్ అవుతుందని పేర్కొన్నారు. 160 మంది జీపీఓలు, ఆర్‌ఐలు, 40 మంది డీటీలు,15 మంది అధికారులు పాల్గొన్నారు.


