అడవికోడిని పట్టిన కేసులో నలుగురి అరెస్టు
చండ్రుగొండ: చండ్రుగొండ అటవీ రేంజ్ పరిధి బెండాలపాడు శివారు కనకగిరి అటవీప్రాంతంలో అడవి కోడిని ఉచ్చుల ద్వారా పట్టుకున్న కేసులో నలుగురిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెండాలపాడుకు చెందిన కణితి గోపాలరావు.. పాల్వంచకు చెందిన సారయ్య, నర్సింహారావు, సాల్మన్‌రాజును పిలిపించి అడవి కోళ్ల వేట ప్రారంభించాడు. పిట్టల అరుపును రికార్డ్ ద్వారా మైక్‌లో వినిపిస్తుండడంతో ఒక కోడి వచ్చి ఉచ్చులో చిక్కుకుంది. ఈ కోడి వన్యప్రాణుల జాబితాలో ఉండడంతో పెట్రోలింగ్ చేస్తున్న అటవీ సిబ్బంది గుర్తించి నలుగురిని చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టు ఆదేశాలతో భద్రాచలం సబ్‌జైలుకు పంపించినట్లు రేంజర్ ఎల్లయ్య తెలిపారు. డీఆర్వో లక్ష్మిపతి, బీట్ సిబ్బంది రామకృష్ణ, హనుమంతు పాల్గొన్నారు.


