ఒకటైనా వచ్చేనా?!
జాబితా పెద్దదే...
మరోసారి తెరపైకి నామినేటెడ్ పదవులు
కాంగ్రెస్‌లోని ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
రాష్ట్రస్థాయి పదవులపై పలువురి కన్ను
ఇప్పటికే కొందరు కొనసాగుతున్నా.. మరికొందరి ప్రయత్నాలు
కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతల్లో నామినేటెడ్ పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చేనెల 15లోగా పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిన నేపథ్యాన పార్టీ పెద్దలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆశావహులు తమ వంతుగా మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఈసారి కూడా ఒకటి, రెండు పదవులైనా దక్కించుకోవాలన్న ఉత్సాహంతో పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నందున ఈసారి ఒక్క పదవైనా వస్తుందా.. వస్తే అది ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
తరచుగా ప్రచారం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. 2024లో కొన్నింటిని భర్తీ చేయగా.. ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. అలాగే ఉమ్మడి, జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. అయినా ఇంకొన్ని పదవులు ఉండడంతో పండుగలు, ఎన్నికల సమయాన ప్రచారం జరుగుతున్నా ముందడుగు పడడం లేదు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులు నియామకం పూర్తవడం, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యాన నేతలు, కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు పదవుల భర్తీకి అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా మార్చి 15లోగా ఖాళీగా ఉన్న కొన్ని పదవులు భర్తీ చేయనున్నారు.
కార్పొరేషన్లపైనే గురి
ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులపైనే గురి పెట్టారు. ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా రాయల నాగేశ్వరరావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొదెం వీరయ్య, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మువ్వా విజయ్‌బాబు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక సంస్థ చైర్‌పర్సన్‌గా నూతి శ్రీకాంత్ కొనసాగుతున్నాయి. ఈసారి రాష్ట్రస్థాయిలో దాదాపు 35కుపైగా పదవులు భర్తీ చేయనుండగా, ఉమ్మడి జిల్లాకు ఒకటి, రెండైనా దక్కుతాయనే విశ్వాసంతో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే తమకు పదవి దక్కేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు తెలిసింది.
జిల్లా స్థాయి పదవులపైనా..
ఇంకొందరు నేతలు జిల్లాస్థాయి పదవులు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నేపథ్యాన ఈసారి భర్తీపై ఆశలు ఉండడంతో తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు భర్తీ కావాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నందున గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించిన వారికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులకు పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో బొర్రా రాజశేఖర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగ సీతారాములు తదితరులు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉండడంతో కొందరు రాష్ట్ర లేదా జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని.. సాధ్యం కాకపోతే వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే భావనతో ఉన్నట్లు సమాచారం.


