సీతమ్మ సాగర్ ఇనుము చోరీ..
● మణుగూరులోని ఇనుప దుకాణాల్లో విక్రయం ● ఇనుము తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీకి సంబంధించిన ఇనుము చోరీ చేసి మణుగూరులోని ఇనుము దుకాణాల్లో విక్రయిస్తున్నారు. గత కాలంగా కొందరు వ్యక్తులు ఇనుము పెద్ద మొత్తంలో తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఈక్రమంలో శుక్రవారం మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలోని ఎల్‌అండ్‌టీ సంస్థ స్టాక్ యార్డ్ నుంచి ట్రాక్టర్‌లో సీతమ్మ సాగర్ ఇనుము చోరీ చేసి మణుగూరుకు తరలిస్తుండగా ఎల్‌అండ్‌టీ సంస్థ అధికారులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సెక్యురిటీ జనరల్ మేనేజర్ జయంత్‌చక్రవర్తి ఫిర్యాదు మేరకు అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన నేలపట్ల రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.
నిద్రావస్థలో అధికారులు..
గత కొంతకాలంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇనుమును పెద్ద మొత్తంలో చోరీ చేసి ఆటోలు, ట్రాక్టర్లలో మణుగూరుకు తరలిస్తున్నారు. ఈక్రమాన ఇనుము దుకాణాల యజమానులు చోరీ ఇనుమును గుర్తు పట్టకుండా ముక్కలుముక్కలుగా చేసి పనిముట్లకు వినియోగించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎల్‌అండ్‌టీ సంస్థ, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎల్‌అండ్‌టీ స్టాక్ యార్డ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వరిస్తున్నా ఇనుము చోరీ ఎలా జరుగుతుందో ఆ సంస్థ అధికారులు, సిబ్బందికే తెలియాలి. దొరికితేనే దొంగ లేకపోతే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇనుము చోరీపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


