ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు
● ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ● ప్రారంభమైన సీఎం కప్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: క్రీడాకారులు తమ ప్రయత్నాలను విజయానికి తొలిమెట్టుగా మలుచుకోవాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. ప్రతీ ప్రయత్నంలో గెలుపు దక్కకున్నా నిరాశ చెందకుండా ముందుకు సాగితే గెలుపు సొంతమవుతుందని తెలిపారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల ఆర్చరీ పోటీలను శుక్రవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరుకాగా సీపీ మాట్లాడారు. ఆర్చరీలో సహజసిద్ధమైన ప్రతిభ ఉన్న జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. క్రీడాపోటీల్లో పాల్గొనడం ద్వారా స్నేహసంబంధాలు మెరుగవుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించే స్ఫూర్తి పెరుగుతుందని తెలిపారు. యువత, విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు దరిచేరవని పేర్కొన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సాధుల సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆర్చరీని జిల్లావ్యాప్తంగా విస్తృతం చేయడంతో పలువురు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, జాతీయ ఆర్చరీ డెవలప్‌మెంట్ సభ్యుడు, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య మాట్లాడగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామారావుతో పాటు వివిధ అసోసియేషన్ల బాధ్యులు గోంగూర వెంకటేశ్వర్లు, ఆదర్శ్‌కుమార్, సాంబమూర్తి, బొంతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


