రుణాలు వంద శాతం వసూలు చేయాలి
చుంచుపల్లి: మహిళా సంఘాలకు ఇచ్చిన సీఐఎఫ్, సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను వంద శాతం వసూలు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.విద్యాచందన ఆదేశించారు. శుక్రవారం చుంచుపల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సమాఖ్య సభ్యులకు సెర్ప్ ద్వారా చేపడుతున్న అన్ని కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్కూల్, మెడికల్, ఆర్టీసీ, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన అన్ని యూనిఫామ్‌లను ప్రభుత్వం మహిళా సంఘాలకే ఇస్తుందన్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా నెలకొల్పాలని, గ్రామ సంఘ భవనాల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ నీలయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సోయం సుజాత, తదితరులు పాల్గొన్నారు.
సదరం క్యాంపు పరిశీలన..
కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపులో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు విధానాన్ని, ఆస్పత్రిలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సేవల లభ్యత, వైకల్య నిర్ధారణకు వినియోగిస్తున్న పరికరాల పనితీరును సమీక్షించి సదరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్య నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


