ఆలయానికి ‘మోక్షం’ | - | Sakshi
Sakshi News home page

ఆలయానికి ‘మోక్షం’

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

ఆలయాన

ఆలయానికి ‘మోక్షం’

నాలుగేళ్లుగా నిర్మాణ పనులు

శిథిలావస్థకు చేరిన శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం

రూ.3 కోట్ల వ్యయంతో పునఃనిర్మాణాం

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శ్యామలా గోపాలన్‌ ట్రస్ట్‌

రేపటి నుంచి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు

పాల్వంచ: వందల ఏళ్లుగా ఆదరణకు నోచుకోని శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ఒకప్పుడు నిత్యపూజలు జరిగేవి. కాలక్రమేణ ఆలయం శిథిలావస్థకు చేరగా భక్తులు ఇబ్బంది పడేవారు. ఆలయ దీనస్థితిపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితం కాగా, శ్యామలా గోపాలన్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నల్లా సురేష్‌ రెడ్డి ఆలయ పునఃనిర్మాణానికి ముందుకొచ్చారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పాత ఆలయ నిర్మాణాలను పూర్తిగా తొలగించి, సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నూతన ఆలయం, చుట్టూ మాడవీధులు, వకుళా మాత, విశ్వక్సేన, భూ వరహస్వామి ఉపాలయాలతో పాటు గోశాల, యాగశాల, ప్రహరీ, గుడి కార్యాలయం, పార్క్‌ తదితర నిర్మాణాలు చేపట్టారు.

గుడిపాడుగా రామచంద్రాపురం..

పాల్వంచ 9వ డివిజన్‌ పరిధి గుడిపాడులో క్రీ.శ.1323లో కాకతీయుల కాలంలో శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారని తెలుస్తోంది. ఆ తర్వాత నిజాం పాలనలో క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. కాకతీయుల కాలంలో ఈ గ్రామం పేరు రామచంద్రాపురం కాగా, గుడి పాడుబడిపోవడంతో గుడిపాడుగా మారిందని చెబుతుంటారు. ఈ ఆలయంలో అద్భుత శక్తి ఉందని, ఇక్కడి స్వామిని వేడుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

21 నుంచి ఆరు రోజుల పాటు వేడుకలు..

ఆలయ పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు విగ్రహాల గ్రామోత్సవం, దీక్షాధారణ, అంకురార్పణ, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద గోష్టి, 22న యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, నిత్య హోమం, క్షీరాభిషేకం, 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు శుద్ధ జలాలతో అభిషేకం, జలాధివాసం, 24న ధాన్యాధివాసం, 25న హోమాలు, పుష్పాధివాసం 26న ప్రాణాధికాశ వాయిన్యాస హోమాలు, మహాపూర్ణాహుతి, శ్రీదేవి, గోదా సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి, గరుడాళ్వార్‌, విశ్వక్సేన, వకుళాదేవి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్యామలా గోపాలన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ పునః నిర్మాణ పనులు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఒకసారి ఆలయానికి వచ్చిన భక్తులు మళ్లీ రావాలనుకునేలా చేయడం తన సంకల్పమని అన్నారు. శనివారం నుంచి జరిగే వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

2022 జూలైలో నాటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ రజినీకుమారి, దాత నల్లా సురేష్‌రెడ్డి, ప్రవళ్లిక దంపతులు భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు నాలుగేళ్ల పాటు పనులు సాగగా ప్రస్తుతం పూర్తి కావొచ్చాయి. ఆలయానికి రోడ్డు కోసం ఇటీవల రూ.80 లక్షలు మంజూరు కాగా త్వరలో 20 అడుగుల రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి.

ఆలయానికి ‘మోక్షం’1
1/1

ఆలయానికి ‘మోక్షం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement