విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
అశ్వాపురం: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక గౌతమీనగర్ కాలనీ ఏఈసీఎస్ స్కూల్‌లో భారజల కర్మాగారం జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ(ఏఈఈఎస్) వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఏఈసీఎస్ విద్యార్థులు ఇటీవల వివిధ పోటీల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందగా కలెక్టర్ వారికి బహుమతులు అందజేశారు. ఏఈఈఎస్ పూర్వ విద్యార్థిగా కలెక్టర్ తన అనుభవాలు పంచుకున్నారు. కార్యక్రమంలో ఏఈసీఎస్ ప్రిన్సిపాల్ ప్రమోద్‌కుమార్ సింగ్, డీజీఎంలు శర్మ, రఫీక్ అహ్మద్, మోహన్‌కుమార్, సీఏఓ లక్ష్మీదేవి, ఏడీఎంఓ లత, ఐఆర్‌ఓ కృష్ణకాంత్ పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు కార్యాచరణ..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రీ ఇంకై ్లన్, అశ్వారావుపేట, నారావారిగూడెం, ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుజాతనగర్, చుంచుపల్లి, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ఆటోమేటిక్ సిగ్నళ్లు, సైన్ బోర్డులు, సూచికల ఏర్పాటుకు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. అశ్వారావుపేటలో అంబులెన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. దమ్మపేట, అళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి రహదారులపై బోర్డుల ఏర్పాటుతో పాటు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగించాలని చెప్పారు. వర్షాకాలానికి ముందే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఏఓ బాబురావు, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఈఈలు నాగేశ్వరరావు, శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ తుకారాం తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ సాగుతోనే నాణ్యమైన దిగుబడులు
బూర్గంపాడు: సేంద్రియ సాగుతోనే నాణ్యమైన పంట దిగుబడులు సాధ్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లక్ష్మీపురంలో యారం లక్ష్మీరెడ్డి అనే రైతు సేంద్రియ విధానంలో సాగు చేసిన మిర్చి పంటను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వివిధ పంటలు సాగు చేస్తున్న లక్ష్మీరెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గుతుందని, ఆ పంటలను తింటే వ్యాధుల బారిన పడతామని అన్నారు. సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సేంద్రియ వరి సాగు చేస్తున్న మేడేపల్లి ఉదయ్‌కుమార్, పామాయిల్ రైతు పోతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


