రంజాన్‌ ఆగమనం.. | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌ ఆగమనం..

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

రంజాన

రంజాన్‌ ఆగమనం..

మత సామరస్యానికి గుర్తు..

ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటున్న మసీదులు

మూడు దశాబ్దాల తర్వాత

శీతల పవనాల్లో రంజాన్‌

క్రమశిక్షణకు వేదికగా నిలవనున్న

రంజాన్‌ మాసం

ఆత్మశుద్ధికి మార్గం

33 ఏళ్ల తర్వాత..

ఈ ఏడాది రంజాన్‌ మాసానికి ఒక చారిత్రక ప్రత్యేకత ఉంది. దాదాపు 33 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంటే సుమారు 1992 – 93 కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఫిబ్రవరి మాసంలోనే రంజాన్‌ రావడం విశేషం. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ చంద్రుని గమనంపై ఆధారపడి ఉండటం వల్ల ఏటా పది రోజులు ముందుకు జరుగుతూ మూడు దశాబ్దాలకు పైగా కాలచక్రాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఫిబ్రవరి నెలకు చేరింది. మండుటెండల ప్రభావం లేకుండా చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈసారి ఉపవాస దీక్షలు సాగడం ముస్లింలకు గొప్ప ఊరటనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, వ్యవసాయదారులు ఈ చల్లని వాతావరణంలో ఉపవాసం ఉంటూనే పనులు చేసుకోవడం సులభతరమవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రార్థనలకు మసీదులు ముస్తాబు..

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి మొదలైంది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు వంటి ప్రధాన పట్టణాల నుంచి కరకగూడెం వంటి మారుమూల గ్రామాల వరకు ప్రతి మసీదును రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. మసీదుల గోపురాలు, ప్రాంగణాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. స్థానిక మసీదు కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశాయి. వజూ కోసం నీటి సౌకర్యం, రాత్రి ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు మసీదుల వద్ద స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ, పరిసరాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. పేదలకు రేషన్‌ కిట్లు పంపిణీ చేయడానికి దాతలుఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో 110 మసీదులు ఉండగా సుమారు 80 వేల మంది ముస్లింలు ఉన్నారు.

జిల్లాలో హిందూ, ముస్లింలు కలసిమెలసి ఈ వేడుకలను జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సౌభ్రాతృత్వం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో మసీదుల నుంచి వినిపించే ప్రార్థనా గీతాలు జిల్లా అంతటా భక్తి భావాన్ని నింపుతున్నాయి. మార్కెట్లలో ఖర్జూరాలు, సేమియా, పండ్ల దుకాణాల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా ఇఫ్తార్‌ విందుల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం జిల్లా గొప్ప సంస్కృతికి నిదర్శనం.

నెలవంక దర్శనంతో

ఉపవాస దీక్షలు షురూ

విశ్వమానవ సౌభ్రాతృత్వం, క్రమశిక్షణ, దాతృత్వాన్ని చాటిచెప్పే రంజాన్‌ మాసం వచ్చింది. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం నుంచి ఉపవాస దీక్షలు మొదలు కానున్నాయి. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు (రోజా) కేవలం ఆహార త్యాగానికి చిహ్నం మాత్రమే కాదు. ఆకలి విలువను తెలుసుకుంటూ నిరుపేదలకు అండగా నిలిచే గొప్ప జీవన సూత్రం. ఈ పవిత్ర మాసంలో ఖురాన్‌ పఠనం, జకాత్‌ (దానధర్మాలు), రాత్రి వేళల్లో సాగే ప్రత్యేక తరావీహ్‌ ప్రార్థనలతో ప్రతి ఇల్లు, ప్రతి మసీదు ఆధ్యాత్మిక నిలయంగా మారనున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ముస్లిం కుటుంబాలు తెల్లవారుజామునే లేచి ‘సహర్‌’ ముగించుకుని తమ కఠిన దీక్షలకు శ్రీకారం చుట్టారు. – కరకగూడెం

పవిత్ర రంజాన్‌ మాసం అల్లాహ్‌ మనకు ప్రసాదించిన గొప్ప అవకాశం. ఈ నెలలో ఖురాన్‌ అవతరించింది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత. ఉపవాసం (రోజా) మనిషిలో సహనాన్ని, క్రమశిక్షణను పెంచుతుంది. మన సంపాదనలో కొంత భాగాన్ని ‘జకాత్‌’ రూపంలో పేదలకు పంచడం ద్వారా సమాజంలో సమానత్వం సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నెలలో దైవచింతనతో గడుపుతూ, తోటి మనుషుల పట్ల దయతో ఉండాలి. 33 ఏళ్ల తర్వాత మరలా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో రంజాన్‌ రావడం అల్లాహ్‌ కరుణగా భావిస్తున్నాను. –మౌలానా మొహమ్మద్‌ ఫిరోజ్‌,

కరకగూడెం జామ మసీదు ఇమామ్‌

రంజాన్‌ ఆగమనం.. 1
1/1

రంజాన్‌ ఆగమనం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement