బీటీపీఎస్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
మణుగూరురూరల్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు బీటీపీఎస్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి మాట్లాడుతూ.. బీటీపీఎస్‌లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న బీటీపీఎస్ సీఈ బిచ్చన్న ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించారు. సీఈ ఆదేశాలతో ఏడీఎం మురళీకృష్ణ, ఎస్‌ఈలు శ్రీనివాసరావు, రమేశ్‌బాబు చర్చల్లో పాల్గొని.. సోమవారంలోపు పెండింగ్ జీతాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గద్దల శ్రీనివాస్, కొడిశాల రాములు, సత్రంపల్లి సాంబశివరావు, సాయికృష్ణ, సత్యనారాయణ, ఎగిడి రవి, భిక్షపతి, నాగరాజు, సూర్య రమేశ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


