నిబంధనలకు నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు!

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

నిబంధ

నిబంధనలకు నీళ్లు!

ప్రమాదంలో ట్రంక్‌ కెనాల్‌

నిర్మాణంలో ఉన్న కాలువ వెంబడి భారీ వాహనాలు

నిబంధనలు అతిక్రమిస్తున్నా స్పందించని ఇరిగేషన్‌ అధికారులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణాలు ఇసుక లారీల కారణంగా ప్రమాదంలో పడ్డాయి. కళ్లెదుటే నష్టం జరుగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు నల్లగొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు (కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు స్థిరీకరణ) గోదావరి నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. మొత్తం 16 ప్యాకేజీలుగా పనులు విభజించారు. ఇప్పటికే రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రాజెక్టు ఫలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు దక్కలేదు. అంచనా వ్యయం రూ. 8 వేల కోట్ల నుంచి ఏకంగా 19 వేల కోట్లకు పైకి చేరుకుంది. సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పూర్తయితేనే కొద్దొగొప్పో ఈ ప్రాజెక్టు కారణంగా ప్రయోజనం నెరవేరేది. కానీ, అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు ద్వారా అందే ప్రయోజనాలకు ఎసరు పెట్టే పని మొదలైంది.

ఇప్పుడు గుంతలు.. రేపు కుంగుబాటు

గోదావరి తీరం వెంబడి అశ్వాపురం మండలంలో సీతమ్మసాగర్‌ బరాజ్‌ నిర్మించే కుమ్మరిగూడేనికి ఎగువన రామ్‌నగర్‌ వద్ద టీజీఎండీసీకి సంబంధించిన ఇసుక ర్యాంప్‌ ఉంది. అక్కడ ఇసుక నింపుకున్న లారీలు కుమ్మరిగూడెం చేరుకుని, అక్కడి నుంచి 9 కి.మీ మేర సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజీ–1లో ఉన్న ట్రంక్‌ కెనాల్‌ గుండా ప్రయాణం చేసి ఏటూరునాగారం – మణుగూరు – ఎన్‌హెచ్‌ 30 (విజయవాడ – జగ్‌దల్‌పూర్‌) రోడ్డుకు చేరుకుంటున్నాయి. సాధారణంగా ఇసుక లారీల బాడీ వెయిట్‌, లోడ్‌ వెయిట్‌తో కలుపుకుని కనిష్టంగా 50 టన్నులకు పైగా బరువుతో ఉంటాయి. హెవీ లోడు కారణంగా అత్యంత పటిష్టమైన జాతీయ రహదారి మీదనే గోతులు, గుంతలు పడుతున్నాయి. అలాంటిది, కాలువ ఎగువ భాగంలో ఉన్న సాధారణ మట్టిరోడ్డు మీదుగా వెళ్లడం వల్ల కెనాల్‌ మనుగడ ప్రమాదంలో పడుతోంది.

బాధ్యత ఎవరిది ?

మొండికుంట–మణుగూరు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు దగ్గరల్లో కెనాల్‌ ఒడ్డు మీదనే వెయింగ్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ తూకం వేసుకునేందుకు వందలాదిగా హెవీ లోడ్‌ లారీలు కెనాల్‌ మీదనే బారులుదీరుతున్నాయి. ఈ లోడ్‌ కారణంగా కెనాల్‌ పటిష్టత దెబ్బతింటోంది. ఇసుక లారీల వల్ల జరుగుతున్న నష్టానికి బాధ్యులు ఎవరనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే ప్యాకేజీ–1కి సంబంధించిన నిర్మాణం ప్రమాదంలో పడుతుంటే జిల్లా యంత్రాంగం మిన్నకుండిపోతోంది. ఈ అంశంపై సీతారామ ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి వివరణ కోరగా.. కెనాల్‌ మీదుగా హెవీ లోడ్‌ వెహికల్స్‌ తిరిగేందుకు అనుమతి లేదని తెలిపారు. ఇసుక లారీలు నడుస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సీతారామ ప్రాజెక్టులో 1 నుంచి 8 ప్యాకేజీలకు సంబంధించిన పనులు రూ.5 వేల కోట్లకు పైగా వెచ్చించారు. ఇందులో 104 కి.మీ ప్రధాన కాలువతో పాటు మూడు పంప్‌హౌస్‌లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో మొదటి ప్యాకేజీ కింద 10.40 కి.మీ పొడవైన కాలువ నిర్మించారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం–దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామాల మధ్య నిర్మించే సీతమ్మ సాగర్‌ బరాజ్‌ నుంచి నీటిని ఒడిసి పట్టి బీజీ కొత్తూరు దగ్గరున్న మొదటి పంప్‌హౌస్‌కు ఈ కాలువ ద్వారానే నీటి సరఫరా చేస్తారు. ఈ కాలువ మెయింటెనెన్స్‌ కోసం ఇరువైపులా మట్టి రోడ్డు (ఒక వైపు కొంత మేర సిమెంట్‌ రోడ్డు ఉంది) నిర్మించారు. బరాజ్‌ నుంచి మొదటి పంప్‌హౌస్‌ వరకు నీరు గ్రావిటీ ద్వారా వచ్చేందుకు వీలుగా సాధారణం కంటే ఎక్కువ లోతుగా కెనాల్‌ నిర్మించారు. అయితే కీలకమైన కెనాల్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకం చేసేలా రోజూ హెవీలోడుతో వందలాది ఇసుక లారీలు తిరుగుతున్నాయి.

సీతారామ ప్రాజెక్ట్‌ కాలువలకు ఇసుక లారీల ముప్పు

నిబంధనలకు నీళ్లు!1
1/1

నిబంధనలకు నీళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement