వైభవంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రామయ్య కల్యాణం

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

వైభవం

వైభవంగా రామయ్య కల్యాణం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ మోడల్‌ స్కూల్స్‌ పథకంలో నూతన పాఠశాలల ఎంపిక కోసం ప్రసిద్ధ, గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం వివరాలు వెల్లడించారు. స్టేట్‌బోర్డు/సెంట్రల్‌ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలలు గత ఐదేళ్లలో 7, 10వ తరగతుల్లో 90 శాతం కంటే ఎక్కువ ఫలితాలు, 50 శాతం కంటే ఎక్కువ మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. విశాలమైన గదులు, వసతి, క్రీడా మైదానం, క్రీడా పరికరాలు, పాఠశాల లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ కలిగి ఉండాలని వివరించారు. అర్హత కలిగిన అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, 50 శాతం కంటే ఎక్కువ సాధారణ సిబ్బంది ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన పాఠశాలలు మార్చి 25వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

రాష్ట్రస్థాయిలో ప్రతిభ

మణుగూరు టౌన్‌: హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రభుత్వ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల ఆటల పోటీల్లో మణుగూరు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ నెల 17న క్రీడలు జరగ్గా మణుగూరు భవిత స్కూల్‌ విద్యార్థులు దుర్గా భవాని, అనిత లెమన్‌ అండ్‌ స్పూన్‌ విభాగంలో రెండో, మూడో స్థానాలు సాధించారు. బహుమతులు అందుకున్నారు. ఈ మేరకు భవిత పాఠశాల నిర్వాహకురాలు నాగజ్యోతి బుధవారం వివరాలు వెల్లడించారు.

తునికాకు టెండర్ల గడువు పొడిగింపు

పాల్వంచరూరల్‌: తునికాకు సేకరణ కోసం అటవీశాఖ ఈ ఏడాది మూడు విడుతలుగా టెండర్లు పిలిచింది. కేవలం సగం యూనిట్లకే టెండర్లు ఖరారు కాగా, మిగిలిన యూనిట్ల కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బుధవారం షార్ట్‌ టెండర్లును పిలిచింది. 4వ విడత టెండర్‌ గడువు ఈ నెల 20 నుంచి 24 వరకు, 5వ విడత గడువు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు ఉంటుందని డీఎం తెలిపారు.

మూడు విడుతల్లో 16 యూనిట్లే..

ఈఏడాది ఇప్పటివరకు మూడు విడుతలుగా టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 31 యూనిట్లకు టెండర్లు పిలువగా, ఇప్పటివరకు 16 యూనిట్లకే టెండర్లు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం డివిజన్‌లో రెండు యూనిట్లు, సత్తుపల్లి డివిజన్‌లోని 3 యూనిట్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు విడతల టెండర్లలోనైనా దరఖాస్తులు వస్తాయని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు ఎదురుచూస్తున్నారు.

వైభవంగా  రామయ్య కల్యాణం1
1/2

వైభవంగా రామయ్య కల్యాణం

వైభవంగా  రామయ్య కల్యాణం2
2/2

వైభవంగా రామయ్య కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement