ఎట్టకేలకు స్నాక్స్‌.. | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు స్నాక్స్‌..

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

ఎట్టకేలకు స్నాక్స్‌..

ఎట్టకేలకు స్నాక్స్‌..

మిగిలింది 19 రోజులే..

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అందజేత

3,395 మంది విద్యార్థులకు రూ.9.67 లక్షలు కేటాయింపు

పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన అధికారులు

ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున మంజూరు

కొత్తగూడెంఅర్బన్‌: పదో తరగతి విద్యార్థులకు ఎట్టకేలకు మంగళవారం నుంచి స్నాక్స్‌ అందిస్తున్నారు. జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు గత డిసెంబర్‌ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరయ్యే విద్యార్థులు అలసిపోతారనే ఉద్దేశంతో ఏటా విద్యార్థులకు స్నాక్స్‌ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్నాక్స్‌ నిధుల మంజూరులో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా జాప్యం జరిగింది. ఈ క్రమంలో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో స్థానికంగా దాతలను ఎంపిక చేసుకుని పిల్లలకు స్నాక్స్‌ అందజేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల స్నాక్స్‌కు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం జనవరిలో ప్రకటించింది. కానీ అమలు మాత్రం మంగళవారం నుంచి చేస్తోంది. డిసెంబర్‌ నుంచే అమలు చేసి ఉంటే విద్యార్థులకు ఎంతో మేలు జరిగేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పరీక్షలు దగ్గర పడే సమయంలో కంటి తుడుపు చర్యగా ఇప్పడు ఇవ్వడం సరికాదంటున్నారు.

పల్లీ పట్టి, మరమరాలతోనే సరి

ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 కేటాయించింది. దీంతో పల్లీపట్టిలు, మరమరాలు, బిస్కెట్లు మాత్రమే అందజేస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలోనైనా విద్యార్థులకు బలం చేకూర్చే పౌష్టికాహారం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మొలకెత్తిన గింజలు, రాగి జావ, టిఫిన్‌ వంటివి కూడా అందజేశారు. కానీ ప్రస్తుతం సాధారణ స్నాక్స్‌ అందజేయడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి.

అధికారుల పర్యవేక్షణ ఉండాలి

గతంలో పాఠశాలల్లో కరాటే శిక్షణకు సంబంధించిన డబ్బుల విషయంలో గందరగోళం నెలకొని ఓ హెచ్‌ఎం అవినీతి బయటపడింది. ప్రస్తుత స్నాక్స్‌ డబ్బులు కూడా పక్కదారి పట్టకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి. స్నాక్స్‌ పంపిణీపై డీఈవోతోపాటు జిల్లా కో ఆర్డినేటర్లు కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరముంది. కాగా ఈ ఏడాది కూడా ఇన్‌చార్జ్‌ల పాలనతోనే జిల్లా విద్యాశాఖ నెట్టుకొస్తోంది. పదో తరగతి ఫలితాలు ఏ మేరకు వస్తాయో వేచి చూడాలి.

జిల్లాలో ఈ ఏడాది ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 12,731 మంది బాలబాలికలు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రైవేటు, కేజీబీవీలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు మినహా జిల్లాలోని 101 జిల్లా పరిషత్‌ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో 3,395 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి 19 రోజుల స్నాక్స్‌ కోసం ప్రభుత్వం రూ.9.67 లక్షలు విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పున కేటాయించింది. కాగా, ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయి. వచ్చే నెల 14 నుంచి పబ్లిక్‌ పరీక్షలు జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement