‘గిరి’ పల్లెల్లో విద్యుత్ వెలుగులు..
కరకగూడెం/దుమ్ముగూడెం: మారుమూల హ్యాబిటేషన్లలో సైతం విద్యుత్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) మోహన్ రావు తెలిపారు. బుధవారం ఆయన కరకగూడెం మండలంలోని తాటిగూడెం, చింతలగుంపు గ్రామాల్లో 25 కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను, దుమ్ముగూడెం మండలంలోని చినబండిరేవులో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక లోఓల్టేజీ సమస్యలు తొలగి నాణ్యమైన విద్యుత్ అందుతుందని, వర్షాకాలంలో కూడా విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉండవని చెప్పారు. రూ.1.80 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. అనంతరం పద్మాపురం గ్రామంలో పూర్తయిన 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు. కాగా 25 ఏళ్లుగా చీకటిలో మగ్గుతున్న చింతలగుంపు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఈ మహేందర్, టెక్నికల్ డీఈలు కృష్ణ, వెంకటేశ్వర్లు, జీవన్ కుమార్, ఏడీఈ ప్రభాకర్‌రావు, ఏఈలు మోహన్‌రెడ్డి, రాజశేఖర్, సర్పంచ్‌లు బి.పార్వతి, కె. విజయలక్ష్మి, ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్ రావు


