ఇల్లెందులోనూ కొలువుదీరారు..
ముగిసిన మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
చైర్‌పర్సన్‌గా కిరణ్‌మిత్రా, వైస్ చైర్మన్‌గా రాజు
ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే కోరం
ఇల్లెందు : ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ముగిసింది. పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నడుమ కార్యక్రమం చేపట్టగా.. ఇతరులను లోనికి అనుమతించకుండా వేడుకలను చూసేలా బయట ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సోమవారమే ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన వారు సకాలంలో హాజరుకాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం 19 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు ఒక రెబల్, ఒక స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి మధు అక్షర క్రమంలో వారితో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో కార్యక్రమానికి హాజరయ్యారు.
చైర్‌పర్సన్‌గా కిరణ్ మిత్రా..
ప్రమాణ స్వీకారం అనంతరం టీపీసీసీ అందజేసిన సీల్డ్ కవర్‌ను ఎమ్మెల్యే కనకయ్య తెరిచి రెండో వార్డు నుంచి గెలుపొందిన దొడ్డా కిరణ్ మిత్రాను చైర్‌పర్సన్‌గా, 17వ వార్డు నుంచి విజయం సాధించిన పెండేలా రాజు(మార్కెట్ రాజు)ను వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. కిరణ్‌మిత్రాను 21వ వార్డు కౌన్సిలర్ నీలపు రమేష్ ప్రతిపాదించగా, 7వ వార్డు కౌన్సిలర్ గోపగాని రాజుగౌడ్ బలపర్చారు. రాజును మూడో వార్డు కౌన్సిలర్ అజ్మీరా వంశీ ప్రతిపాదించగా 24వ వార్డు కౌన్సిలర్ శనిగరపు శృతి బలపర్చారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లకు ఎన్నికల అధికారి ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు సేవలందిచడంతో పాటు ఇల్లెందు అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. రాజకీయాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమం, అభివృద్ధిని సమ పాళ్లలో అందించాలని కోరారు. ఆ తర్వాత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లందరినీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్‌సింగ్, మేనేజర్ అంకుషావళీ, డీఈ మురళీ, ఆర్‌ఐ శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్‌లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య తదితరులు పాల్గొన్నారు.
చైర్‌పర్సన్ బయోడేటా..
పేరు : కిరణ్ మిత్రా దొడ్డా
భర్త : దొడ్డా డానియేల్ (పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు)
పిల్లలు : ఆర్డర్ అనిరుధ్, రోహిత్
విద్యార్హత : ఎంఏ, బీఈడీ
వృత్తి : ప్రైవేట్ టీచర్
పుట్టిన తేదీ : 29.05.1980
నివాసం : ఇల్లెందులపాడు, 2వ వార్డు
ఇల్లెందులోనూ కొలువుదీరారు..


