నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక మంగళవా రం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
రామయ్యను దర్శించుకున్న ఆదిలాబాద్ జడ్జి
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆదిలాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి కె. ప్రభాకర్ రావు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీ–హబ్ ద్వారా పరీక్షలు చేయించాలి
చుంచుపల్లి: ప్రతీ నెల పీహెచ్‌సీ స్థాయిలో క్షయ బాధితులకు టీ–హబ్ ద్వారా పరీక్షలు చేయించాలని, అందుకోసం ప్రత్యేక క్లినిక్‌లను నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్ ఆదేశించారు. మంగళవారం కొత్తగూడెంలో టీబీ కేర్ అంశంపై జిల్లాలోని వైద్యాధికారులు, ఎన్‌టీఈపీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆ తర్వాత కొత్తగూడెం, పాల్వంచలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వి.సుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగలక్ష్మి, సిబ్బంది పుల్లారెడ్డి, మోహన్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఇల్లెందురూరల్: ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం సూచించారు. ఇల్లెందులోని పలు బస్తీ దవాఖానాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఇల్లెందు, గుండాల, టేకులపల్లి మండలాల పరిధిలోని ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమతుల ఆహారం ప్రాముఖ్యతపై ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్‌కు ముందడుగు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనుల కోసం మంగళవారం ఆలయ పరిసరాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. సుమారు రూ. 534 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి, ఆర్కిటెక్ట్ నవనీత్ ఆధ్వర్యంలో తాత్కాలికంగా మార్కింగ్ చేపట్టారు. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం భవిష్యత్‌లో ఆలయం చుట్టూ నిర్మించబోయే భవన సముదాయాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసే మాఢ వీధులు ఎక్కడి వరకు విస్తరిస్తాయనే అంశాన్ని గుర్తించి, తదుపరి కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదరావు, ఈఈ రవీందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
యాప్ ద్వారానే యూరియా
ఇల్లెందురూరల్: యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని డీఏఓ బాబూరావు రైతులకు సూచించారు. మండల, పట్టణ పరిధిలోని యూరియా విక్రయ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాప్‌లో నమోదు కాకుండా ఒక్క బస్తా కూడా విక్రయించొద్దని వ్యాపారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 22,310 మంది రైతులు యాప్‌లో బుకింగ్ చేసుకొని 90,240 బస్తాల యూరియా కొనుగోలు చేశారని చెప్పారు. పట్టా లేని రైతులకు, కౌలు రైతులకు కూడా యాప్ ద్వారా యూరియా విక్రయిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఓ సతీష్, ఏఈఓ సుమన్ పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


