పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు

పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ సెంటర్‌కు చీఫ్‌ సూపరింటెండెంట్‌తో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించామని, పరీక్షలు సజావుగా సాగేలా అనుభవజ్ఞులైన ఇన్విజిలేటర్లను నియమించాలని సూచించారు. ప్రశ్న, జవాబు పత్రాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి, భద్రత మధ్య కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బీ సెక్షన్‌ అమలు చేయాలని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా సాగించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్‌ సెంటర్లనును మూసివేయాలని ఆదేశించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను జాగ్రత్తగా మూల్యాంకన కేంద్రాలకు పంపించేలా చర్యలు చేపట్టాలని పోస్టల్‌ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలని, ప్రథమ చికిత్స సదుపాయం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

చుంచుపల్లి: గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ సూచించారు. సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామ పాలన, బాధ్యతలు, కర్తవ్యాలపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకే శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామాలకు అందుతున్న నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్‌, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, విద్యుత్‌ స్తంభాలు, పబ్లిక్‌ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని, చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని కోరారు. ప్రతీ గ్రామంలో ఇప్ప పువ్వు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయ వనరులు సృష్టించవచ్చని, పశుసంపదను అభివృద్ధి చేయాలని చెప్పారు. అనంతరం సర్పంచులకు శిక్షణ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్‌ కుమార్‌, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్‌, రమణ, టీజీఐఆర్టీ సెంటర్‌ హెడ్‌ సుభాష్‌ చంద్ర గౌడ్‌, శిక్షకులు బన్సింగ్‌, రవీందర్‌ రెడ్డి, సునీల్‌ కుమార్‌, ముత్యాలరావు, హజ్‌రత్‌ వలి, ఏపీఓ రంగ, ఎస్‌బీఎం రేవతి, డీటీఎం సందీప్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement