హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
బూర్గంపాడు: రూ. 2 కోట్ల బీమా సొమ్ము కాజేసేందుకు యువకుడిని హతమార్చాలని యత్నించిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ మేడ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మండలంలోని మోతె పట్టీనగర్ సమీపంలో ఈనెల 14న కట్టా యశ్వంత్‌ను ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్లతో తలపై దారుణంగా కొట్టి గాయపర్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మంగళవారం కారులో పరారవుతుండగా సారపాక వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. ఏపీలోని గన్నవరం గ్రామానికి చెందిన కట్టా యశ్వంత్ పేరున రూ. 2 కోట్లకు బీమా చేసి, నామినీగా అదే గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్ పేరు పెట్టారు. భద్రాచలంలోని ఓ బ్యాంక్‌లో ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్‌గా ఉన్న భానుప్రకాశ్ ఈ వ్యవహారంలో సూత్రధారిగా వ్యవహరించాడు. సాయిదీపక్, భానుప్రకాశ్ పథకం ప్రకారం గత నవంబర్‌లో యశ్వంత్ పేరున బీమా చేయించి రూ.2లక్షల ప్రీమియం చెల్లించారు. నాటినుంచి యశ్వంత్‌తో స్నేహంగా ఉంటూనే హతమార్చాలని, తద్వారా రూ.2 కోట్ల బీమా సొమ్ము కాజేయాలని కుట్ర చేశారు. ఈ క్రమంలో ఈనెల 14న ముగ్గురూ కలిసి మద్యం సేవించాక యశ్వంత్ తలపై రాడ్లతో కొట్టి హత్యాయత్నం చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డుపై పడేశారు. బాధితుడిని వారే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ప్రయత్నించారు. వారి ప్రవర్తనపై అనుమానంతో బాధితుని కుటుంబ సభ్యులు సాయిదీపక్, భాను ప్రకాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.
బీమా సొమ్ము కాసేందుకు పన్నాగం


