రహదారి నిర్మించాలని ధర్నా
దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక నుంచి పర్ణశాల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని మంగళవారం దుమ్ముగూడెం యువత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అఖిలఫక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. ఇసుక లారీలతో ధ్వంసమైన రహదారితో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరిగి ప్రజలు మృత్యువాత పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ యువత.. లక్ష్మీనగరం, ములకపాడు గ్రామాల్లో బంద్‌తో పాటు రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించారు. తొలుత లక్ష్మీనగరం నుంచి ములకపాడు వరకు ర్యాలీ చేపట్టి, ములకపాడు సెంటర్‌లో ధర్నా చేశారు. గుంతలమయంగా మారిన రహదారితో ఎందరో మృత్యువాత పడుతున్నారని, తూరుబాక నుంచి పర్ణశాల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫోన్‌లో ఆందోళనకారులతో మాట్లాడుతూ.. మరమ్మత్తు పనులు చేపడతామని చెప్పారు. తహసీల్దార్ అశోక్‌కుమార్, సీఐ వెంకటప్పయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మరమ్మతులు చేపడతామని, రాత్రి సమయంలోనే లారీలు నడిచేవిధంగా చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో నాలుగు గంటలపాటు నిర్వహించిన ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు లంకా శ్రీనివాసరావు, కణితి రాముడు, యండీ జానీపాషా, యలమంచి వంశీకృష్ణ, యలమంచి శ్రీనుబాబు, కొమరం చంటి, బొల్లోజు వేణు, రామిరెడ్డి, సోయం కామరాజు, సొందె మల్లూరు, జిలకర చంటి, క్రాంతి పాల్గొన్నారు.


