ఇసుక రవాణాను అడ్డుకున్న సర్పంచ్
పాల్వంచరూరల్: అర్ధరాత్రి కిన్నెరసాని వాగు నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండగా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వప్న మరో ఇద్దరు వార్డు సభ్యులతో కలిసి అడ్డుకున్నారు. మండలంలోని నాగారం సమీపంలోని కిన్నెరసాని వాగు నుంచి మంగళవారం రాత్రి ఇసుక తరలిస్తుండగా వార్డు సభ్యులు రంజిత్, లక్ష్మి, అంగోతు లచ్చుతో కలిసి సర్పంచ్ స్వప్న ఘటనా స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న ఉపేందర్ తనపై, తనతోపాటు వచ్చిన పవన్‌పై దాడికి యత్నించాడని, దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించాడని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పట్టుకోని అధికారులు..
కాగా, కిన్నెరసాని వాగులో జేసీబీతో ఇసుక తోడి తరలిస్తున్నట్లు సర్పంచ్ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేసీబీని సీజ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం.


