మోసం చేశాడని యువతి ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మోసం చేశాడని యువతి ఆందోళన

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

మోసం

మోసం చేశాడని యువతి ఆందోళన

కూసుమంచి: మండలంలోని ముత్యాలగూడెం గ్రామానికి చెందిన యువకుడు మనోజ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. గ్రామంలోని మనోజ్‌ ఇంటి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన ఆమె వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాకకు చెందిన తనతో మనోజ్‌కు పరిచయం ఏర్పడగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువుగా ఉన్నాడని తెలిపింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడంటూ తన కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి బైఠాయించింది. కాగా, ఎవరి నుంచీ స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగించింది. ఈ విషయమై ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.

అక్రమ డీజిల్‌ సీజ్‌

దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న డీజిల్‌ క్యాన్లను పోలీసులు సోమవారం సీజ్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని వేగవరం నుంచి 600 లీటర్ల పరిమాణం కలిగిన డీజిల్‌ క్యాన్‌లతో వస్తున్న కారును మండలంలోని మందలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. డీజిల్‌కు సంబంధించి, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, డీజిల్‌ను సీజ్‌ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం సివిల్‌ సప్‌లై డిపార్ట్‌మెంట్‌కు అప్పగించామని ఎస్‌ఐ సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

మావోయిస్టుల స్మారక స్తూపాలు ధ్వంసం

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మరియాపారా గ్రామంలో మావోయిస్టుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు సోమవారం ధ్వంసం చేశాయి. కిష్టారం ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా నిలుస్తుండగా, గతంలో వివిధ ఘటనల్లో మృతి చెందిన మావోయిస్టులు వంజం హిద్మా, బల్దేవ్‌ సమర్‌, ధన్‌ సమర్‌ స్మారక స్తూపాలను నిర్మించారు. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా దూకుడు పెంచిన భద్రతా బలగాలు పలుచోట్ల మావోల గుర్తులను కూడా చెరిపేస్తున్నాయి. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్‌ 217 బెటాలియన్‌, 212 బెటాలియన్‌ సిబ్బంది ఇక్కడి స్మారక స్థూపాలను జేసీబీలతో తొలగించారు.

ఆర్మీ జవాన్‌ కేశవరెడ్డి మృతి

బూర్గంపాడు: మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ మారం కేశవరెడ్డి(36) కేరళలోని ఎర్నాకుళంలో మృతిచెందాడు. జమ్మూ కశ్మీర్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న అతను మూడు నెలలుగా సెలవులో ఉన్నాడు. అయ్యప్ప మాలధారణ చేసిన కేశవరెడ్డి శబరిమలైకు వెళ్లి ఇరుముడి సమర్పించుకున్నారు. తిరుగుపయనంలో ఎర్నాకుళం చేరుకున్నాడు. అక్కడ ప్రమాదవశాత్తు ఓ బిల్డింగ్‌ పైనుంచి కిందపడి మృతిచెందినట్లు అక్కడి పోలీసులు సోమవారం కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే కేశవరెడ్డి మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

ములకలపల్లి: భారీయంత్రంతో వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టగా, డ్రైవర్‌, క్లీనర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. భారీ లారీ జేసీబీతో చైన్నె నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తోంది. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున అదుపుతప్పి మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న డివైడర్‌ను ఢీకొట్టింది. లారీ కేబిన్‌ ప్రమాదానికి గురైంది. కాగా సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో భాగంగా డివైడర్‌ నిర్మిస్తున్న క్రమంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మోసం చేశాడని యువతి ఆందోళన1
1/3

మోసం చేశాడని యువతి ఆందోళన

మోసం చేశాడని యువతి ఆందోళన2
2/3

మోసం చేశాడని యువతి ఆందోళన

మోసం చేశాడని యువతి ఆందోళన3
3/3

మోసం చేశాడని యువతి ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement