సత్తుపల్లి.. రూటే సెపరేటు! | - | Sakshi
Sakshi News home page

సత్తుపల్లి.. రూటే సెపరేటు!

Feb 9 2026 7:32 AM | Updated on Feb 9 2026 7:32 AM

సత్తుపల్లి.. రూటే సెపరేటు!

సత్తుపల్లి.. రూటే సెపరేటు!

● ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ● ప్రతీ ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పు

నగర పంచాయతీ..

మున్సిపాలిటీలో..

● ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ● ప్రతీ ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పు

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, ఆపై ఖమ్మం ఎంపీగానూ ఎన్నికై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక జలగం ప్రసాదరావు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే, గతంలో ఇక్కడ, ఆ తర్వాత పాలేరు, ప్రస్తుతం ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన పొంగులేటి శ్రీనివా సరెడ్డి తొలిసారి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

గుండెకాయలా మున్సిపాలిటీ..

సత్తుపల్లి పట్టణ ఓటరు తీర్పు ప్రతీసారి విలక్షణంగా ఉంటుంది. అధికార పార్టీ హవా నడిచే సమయాల్లోనూ ఓటర్లు నిశ్శబ్ద తీర్పుతో ఆశావహులకు ముచ్చెమటలు పట్టించిన దాఖలాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రకంగా.. లోక్‌సభ ఎన్నికల్లో మరో రకంగా.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంకో రకంగా తీర్పు ఇవ్వడం ఓటర్ల ప్రత్యేకత. అందుకే సత్తుపల్లి నియోజకవర్గానికే గుండెకాయ వంటి మున్సిపాలిటీ ఓటరు తీర్పుపై అన్ని పక్షాలు ఆసక్తిగా గమనిస్తుంటాయి.

ఊహించని విధంగా తీర్పులు

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అధికారం చెలాయించే సమయాన 1992 ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం విశేషం. తుమ్మల మంత్రిగా అధికారం శాసిస్తుండగా 2001 లో సత్తుపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన కొత్తూరు ప్రభాకర్‌రావును కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్ధి కోటగిరి మురళీకృష్ణారావు ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. 2001లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తుపల్లిలోని ఆరు స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకటరావు చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చవిచూశారు.

నగర పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ

సత్తుపల్లి నగర పంచాయతీగా ఉన్నప్పుడు 2014లో జరిగిన ఎన్నికల్లో 20 వార్డులకు గాను టీడీపీ 17చోట్ల గెలవగా, మరో మూడింటిని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. ఆతర్వాత మున్సిపాలిటీగా ఏర్పడ్డాక తొలిసారి 2020లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 23 వార్డులకు గాను వంద శాతం బీఆర్‌ఎస్‌కు దక్కించుకోవడం విశేషం. అప్పుడు బీఆర్‌ఎస్‌లో ప్రస్తుత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌, ఐడీసీ చైర్మన్‌ మువ్వా విజయబాబు ఉన్నారు. ఈసారి వీరందరూ కాంగ్రెస్‌ ఉండగా, రాజకీయ సమీకరణల నేపథ్యాన ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.

పాలకులు వీరే..

సత్తుపల్లి పంచాయతీ ఏర్పడ్డాక 1961లో తొలి సర్పంచ్‌గా మొరిశెట్టి రాజయ్య ఎన్నికై 1966 వరకు కొనసాగారు. ఇక గాదె నర్సయ్య 1966 నుంచి 70వరకు, అనుమోలు నర్సింహారావు 1970 నుంచి 83వరకు, కొత్తూరు ప్రభాకర్‌రావు 1983–88 వరకు సర్పంచ్‌గా ఉన్నారు. అలాగే, కోటగిరి మురళీకృష్ణారవు 1988 నుంచి 95వరకు, కొత్తూరు పార్వతి 1995 నుంచి 2001 వరకు, కోటగిరి మురళీకృష్ణారావు 2001 నుంచి 2005 వరకు సర్పంచ్‌గా కొనసాగారు.

సత్తుపల్లి గ్రామ పంచాయతీ 2005లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయ్యాక చైర్మన్‌ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. తొలి చైర్‌ పర్సన్‌గా పూచి యశోద 2010 వరకు, రెండో సారి బీసీ మహిళకు రిజర్వ్‌ అయితే దొడ్డాకుల స్వాతి 2014 నుంచి 2019 వరకు కొనసాగారు. 2020 లో మున్సిపాలిటీగా ఏర్పాటయ్యాక తొలి చైర్మన్‌గా కూసంపూడి మహేష్‌ ఎన్నికై 2025 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మున్సిపాలిటీకి రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement