గోదావరికి ఘనంగా నదీ హారతి
విశాఖలో వైభవంగా కల్యాణం
భద్రాచలం: గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీహారతిని వైభవోపేతంగా జరిపారు. భాను సప్తమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురోహితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భానుసప్తమి రోజున నదీ హారతి విశిష్టతను పురోహితులు వివరించారు. రామాలయ ఈఓ కె. దామోదర్‌రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, పురోహితులు సురేష్ వర్మ, పవన్ కుమార్ వర్మ, అశోక్ కుమార్ పాల్గొన్నారు.
భద్రగిరిలో మూలమూర్తులకు అభిషేకం
అంతరాలయంలో ఆదివారం మూలమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు.
విశాఖపట్నంలో భద్రగిరి రామయ్య కల్యాణం ఆదివారం వైభవోపేతంగా జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారంలో భాగంగా భక్తుల కోరిక మేరకు నిర్ణీత రుసుముతో స్వామి వారి కల్యాణం జరుపుతారు. ఈ క్రమంలోనే బీర్‌రోడ్‌లో ఉన్న గాదిరాజు ప్యాలెస్‌లో కల్యాణ వేడుక కమనీయంగా జరిపారు. భద్రగిరి నుంచి వచ్చిన సీతారాముల ఉత్సవమూర్తులకు శోభాయాత్రతో ఘన స్వాగతం పలికారు. కల్యాణ తంతును అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ శ్రవన్‌కుమార్ దంపతులు, స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ పాల్గొన్నారు.
గోదావరికి ఘనంగా నదీ హారతి


