తీరంలో అపరిశుభ్రత
నదీ హారతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు
అందుబాటులో లేని
దుస్తులు మార్చుకునే గదులు
పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలకు తప్పని పాట్లు
ర్యాంప్ లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులకూ అవస్థే
సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్‌కు వేడుకోలు
భద్రాచలం: ప్రతీ ఆదివారం అర్చకులు, భక్తులు సమర్పిస్తున్న నదీ హారతితో గోదావరి తల్లి పులకరిస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణంతో మహిళా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పుణ్యస్నానాలకు, నదీ హారతికి వచ్చే భక్తులకు అపరిశుభ్రత స్వాగతం పలుకుతోంది. భక్తులు వాడే ప్లాస్టిక్ సంచులు, దుస్తులు, పూజా సామగ్రి అట్టలు, చిరు దుకాణాల వ్యర్థాలతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. పారిశుద్ధ్య మెరుగుకు రైల్వే, బస్ స్టేషన్లలో మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామపంచాయతీ కార్మికులను కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. నదీ హారతికి ముందు తప్పనిసరిగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొంటున్నారు.
మహిళా భక్తుల బాధలు వర్ణనాతీతం
గోదావరి పుణ్యస్నానాలకు వచ్చే మహిళా భక్తుల బాధలు వర్ణనాతీతం. స్నానాలు ఆచరించాక వస్త్రాలను మార్చుకోవాలంటే గోదావరి తీరం నుంచి కరకట్ట(వస్త్రాలు మార్చుకునే గదుల) వరకు అదే తడి బట్టలతో రావాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. పురుషులు, ఇతరుల నడుమ తడి బట్టలతో రావాల్సి వస్తుండటంతో పలువురు పుణ్యస్నానాలకు జంకుతున్నారు. గోదావరి తీరంలోనే తాత్కాలిక గదులు ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
ర్యాంప్ ఏర్పాటు చేయరూ..
గోదావరి పుణ్యస్నానాలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు పాట్లు తప్పడంలేదు. ఎక్కువ దూరం నడిచి, మళ్లీ మెట్లపైకి చేరాలంటే అక్కడే వైకుంఠ రాముడు కనిపిస్తున్నాడని పేర్కొంటున్నారు. సినిమాహాళ్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయని, మరి భక్తులు వచ్చే గోదావరి తీరంలో ర్యాంపులు ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నిస్తున్నారు. నీడలో కూర్చొని వీక్షించాలన్నా, కొద్ది మేర భక్తులు సేద తీరాలన్నా తీరంలో కనీస షెడ్‌లు లేవు. కరకట్టపై ఓపెన్ షెడ్లు నిర్మిస్తే రోజూ వచ్చే భక్తులతోపాటు ప్రధాన ఉత్సవాలైన ముక్కోటి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నదీ హారతికి శాశ్వత వేదిక ఏర్పాటు చేయాలని, కాశీ తరహాలో విశ్వవ్యాప్తం చేయటానికి మరిన్ని వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
అవగాహన, భాగస్వామ్యం ప్రధానం
నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. రోజుకో శాఖ అధికారులు, భక్తులు, యువతతో ఉచిత పారిశుద్ధ్య సేవలు నిర్వహించాలి. తద్వారా గోదావరి తీరం పరిశుభ్రంగా ఉండటంతోపాటు భక్తుల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అప్పుడే నదులను, వాటి విశిష్టతను యువతరానికి పరిచయం చేయాలనే కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్ష్యం నెరవేరుతుంది. నదీ హారతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ గోదావరి తీరంలో, కరకట్ట సమీపంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
తీరంలో అపరిశుభ్రత


