‘మల్బరీ’తో నికర ఆదాయం
● కుటీర పరిశ్రమ తరహాలో ఉపాధి ● రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ అధికారులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): మల్బరీ సాగుతో రైతులు నికర ఆదాయం పొందేలా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీసం రెండెకరాల్లో సాగు చేసినా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మేర ఆదాయం వస్తుందని చెబుతున్నారు. జిల్లాలో ప్రసుత్తం 95 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. మరింత మంది రైతులు ముందుకొచ్చేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగ కిషోర్ మల్బరీ సాగుపై వివరాలు వెల్లడించారు.
ఏడాదంతా ఉపాధి
గ్రామీణ ప్రాంత పేద, నిరుపేద రైతులు పట్టు పరిశ్రమను కుటీర పరిశ్రమలా ఎంచుకోవచ్చు. 60 శాతం కంటే ఎక్కువ మహిళా భాగస్వామ్యం కలిగి కుటుంబ సభ్యులందరికీ ఉపాధి లభిస్తుంది. ఎకరం మల్బరీ తోట సాగు చేస్తే ఏడాది పొడవునా ఉపాధికి ఢోకా ఉండదు. మల్బరీ బహువార్షిక పంట కావడం, అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోవడమే కాక తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభం పొందొచ్చు. జిల్లా భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట మండలాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు.
సాగు ఇలా...
ఎకరం మల్బరీ సాగుకు 5,500 నారు మొక్కలు అవసరమవుతాయి. వీటిని 3 ఇంటూ 3 సాళ్ల పద్ధతిలో నాటుకోవాలి. అధిక దిగుబడినిచ్చే వీ1, ఎస్5 తదితర రకాలను జూన్‌లో నాటి కలుపు తీస్తూనే తగు మోతాదులో పశువుల ఎరువు వేయాలి. భూసార పరిరక్షణకు పశువుల ఎరువు ఎనిమిది టన్నులను ఏటా నాలుగు విడతలుగా వేయాలి. చాకీ తోట అయితే 16 టన్నులు అవసరమవుతుంది. ఈ పరిశ్రమ ద్వారా ఏడాదిలో 5 నుంచి 10 పంటలు రావడం ద్వారా ప్రతీనెల ఆదాయాన్ని పొందే వీలుంటుంది. కాగా, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 75 శాతం సబ్సిడీ అందుతుంది. ఇక ఎకరం మల్బరీకి అవసరమైన పట్టు గుడ్లను చాకీ సెంటర్ల నుండి రూ.450(వంద గుడ్లకు) చెల్లించి పొందొచ్చు. ఆపై ఎకరం పంటకు 75 నుండి 100 కేజీలను ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం పట్టుగూళ్ల ధర కేజీకి రూ.500 నుంచి రూ.700 పలుకుతోంది. తద్వారా ఎకరం మల్బరీ సాగు చేస్తే సంవత్సరంలో రూ.5లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం పొందొచ్చు.


