సింగరేణిలో భారీగా అవినీతి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో భారీగా అవినీతి

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

సింగరేణిలో భారీగా అవినీతి

సింగరేణిలో భారీగా అవినీతి

● రెండు పార్టీలు సంస్థను నిర్వీర్యం చేశాయి ● కొత్తగూడేన్ని అమృత్‌ సిటీగా మార్చుతాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

● రెండు పార్టీలు సంస్థను నిర్వీర్యం చేశాయి ● కొత్తగూడేన్ని అమృత్‌ సిటీగా మార్చుతాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

చుంచుపల్లి: సింగరేణి టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని, పారదర్శకత లేపోవడంతోనే ఆరోపణలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు సింగరేణిని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. ఫలితంగా సింగరేణి నేడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక రాష్ట్రాన్ని లూటీ చేసిన బీఆర్‌ఎస్‌, గత రెండేళ్లుగా దోచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్లడిగే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఆ తర్వాత ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు మినహా మిగిలిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. అప్పుడు కేసీఆర్‌, ఇప్పుడు రేవంత్‌రెడ్డి రాహు కేతువుల్లా మారారని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రమాదంపై అనుమానాలు

ఎఫ్‌ఎస్‌ఎల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో అనుమానాలు ఉన్నాయని రామచందర్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సైతం సెక్రటేరియట్‌లో ఫైళ్లు దగ్ధమయ్యాయని, ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ సంబంధించిన ముఖ్యమైన రికార్డులు తగలబడి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అవినీతి వ్యవహారంలో అధికారులను అరెస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద నాయకులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదన్నారు. కార్పొరేషన్‌ను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐలు పట్టించుకోకపోవడంతో గోదావరి పక్కనే ఉన్న ప్రతీ ఇంటికి నీళ్లు కూడా రాలేదన్నారు. కొత్తగూడేన్ని అమృత్‌ సిటీగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్పొరేషన్‌ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు జీవీకే మనోహర్‌, రంగాకిరణ్‌, ముసుగు శ్రీనివాసరెడ్డి, పొడియం బాలరాజు, విద్యాసాగర్‌, గొడుగు శ్రీధర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement