ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు
చుంచుపల్లి: కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని, సేవల ధరల జాబితాను ప్రజలకు కనిపించేలా ఉంచాలని సూచించారు. నిబందనల రేట్ల ప్రకారం మాత్రమే చార్జీలు వసూలు చేయాలని, విధులు నిర్వహిస్తున్న వైద్యుల పేర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేవించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవసరమైన అన్ని పత్రాలను రిసెప్షన్ వద్ద అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భద్రు, సిబ్బంది మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వెదురు ట్రాక్టర్ సీజ్
దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా వెదురును తరలిస్తున్న ట్రాక్టర్‌ను దమ్మపేట అటవీ శాఖ సిబ్బంది సీజ్ చేశారు. దమ్మపేట ఫారెజ్ట్ రేంజ్ కార్యాలయ అధికారి శ్రీనివాస్ కథనం ప్రకారం.. దమ్మపేట రేంజ్‌లోని పూసుకుంట సెక్షన్ పరిధిలోని బండారుగుంపు నుంచి ఆదివారం అక్రమంగా వెదురును తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. బండారుగుంపులో వెదురు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని, రేంజ్ కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, కేసు నమోదు చేశామని శ్రీనివాస్ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరకగూడెం/కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కరకగూడెం మండలం రఘనాథపాలెం జీపీ వెంకట్రాంపురం గ్రామానికి చెందిన సాధు శ్రీను (41) మృతిచెందాడు. శ్రీను బైక్‌పై మరిపెడ నుంచి సొంత గ్రామానికి వస్తుండగా చింతపల్లి నుంచి క్రషర్ మిల్లు వైపునకు నలుగురు కూలీలు వెళ్తున్నారు. అందులో సునీల్ అనే వ్యక్తిని శ్రీను బైక్ ఢీకొట్టింది. సునీల్‌కు స్వల్ప గాయాలవగా.. బైక్ పైనుంచి పడగా శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీనును మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ పోలీసులు తెలిపారు.
ఇల్లు దగ్ధం
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి పవన్ అనే వ్యక్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ స్విచ్‌బోర్డులో నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న సోఫాకు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రూ.3 లక్షల నగదు, 16 గ్రాముల బంగారం దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో వచ్చిన అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు.
వాగులో పడి వ్యక్తి మృతి
చుంచుపల్లి: ఇసుక కోసం వెళ్లిన వ్యక్తి వాగులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని సాటివారిగూడేనికి చెందిన ఈసం వెంకటేశ్వర్లు (39) ఎడ్ల బండితో ఇసుకను తీసుకొచ్చే క్రమంలో వాగులో పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు


