మిగిలింది రెండు నెలలే..
ఉత్పత్తి పెంపునకు సమీక్షలు
● బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ ● లక్ష్యంలో ఇంకా 24 మిలియన్ టన్నులు బాకీ ● జనవరిలో 74శాతానికే ఉత్పత్తి పరిమితం
రుద్రంపూర్: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, గడిచిన పది నెలల్లో 58.47 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 48 మిలియన్ టన్నుల(84శాతం) ఉత్పత్తి మాత్రమే నమోదైంది. అంటే ఇంకా మిగిలిన రెండు మాసాల్లో 24 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెనుకంజ
వార్షిక లక్ష్య సాధనలో భాగంగా రోజుకు 2.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి. కానీ ఇప్పుడు రోజుకు 1.50 లక్షల టన్నులు (55 శాతం) దాటడం లేదు. జవనరిలో సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోని 18 ఓపెన్‌కాస్ట్ గనులు, 20 భూగర్భ గనుల్లో 70,01,100 టన్నుల లక్ష్యానికి 51,55,921 టన్నుల(74శాతం) మాత్రమే నమోదు కాగా, 26శాతం వెనుకంజలో ఉన్నట్లు సంస్థ వెల్లడించిన గణాంకాల ద్వారా వెల్లడైంది.
సత్తుపల్లి ఏరియా టాప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది నెలలు గడిచిపోయాయి. ఈసమయంలో సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో ఒక్క సత్తుపల్లి ఏరియానే 39.45లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 40,39,200 (102శాతం) టన్నుల ఉత్పత్తి సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఏ ఏరియా కూడా 100శాతం ఉత్పత్తి సాధించలేక పోయాయి. జనవరి నెలలో పరిశీలిస్తే బెల్లంపల్లి ఏరియా మొదటి స్థానంలో, సత్తుపల్లి ఏరియా రెండో స్థానంలో నిలిచాయి. రోజు వారీ ఉత్పత్తిలో ఒక్క ఏరియా కూడా 100శాతం నమోదు చేయలేకపోవడం గమనార్హం.
52 మిలియన్ టన్నులతో సరి?
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో వెనకపడేలా ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉత్పత్తిలో కోలిండియాకు దీటుగా నిలిచిన సింగరేణి ఈ ఏడాది 80శాతం దాటడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఇటీవల సింగరేణిలో అధికారుల ప్రక్షాళన, ఓబీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, భూగర్భగనుల్లో మొండికేసిన యంత్రాలు.. వెరసి ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముంది. మిగిలిన రెండు నెలల్లో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైనా మొత్తంగా 52 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించే అవకాశముందన్న భావన వ్యక్తమవుతోంది. ఫలితంగా లక్ష్యసాధనలో 20 మిలియన్ టన్నుల మేర వెనకంజలో ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.
సింగరేణిలోని భూగర్భగనుల్లో కొంత ఉత్పత్తి నష్టం ఉంది. ఈ నేపథ్యాన ఓపెన్ కాస్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం ఓబీ కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించి గనుల వారీగా లోపాలను సవరించి లక్ష్యసాధనకు కృషి చేస్తాం.
– ఎల్.వీ.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్)
మిగిలింది రెండు నెలలే..


