పైసలిచ్చి పత్రం తీసుకో..? | - | Sakshi
Sakshi News home page

పైసలిచ్చి పత్రం తీసుకో..?

Feb 4 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:13 AM

పైసలిచ్చి పత్రం తీసుకో..?

పైసలిచ్చి పత్రం తీసుకో..?

సర్టిఫికెట్‌కో రేటు

అక్రమాలకు అడ్డాగా

భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయం

లంచాలతో ప్రజలు బెంబేలు..

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వద్ద ‘డిజిటల్‌ కీ’?

ఏసీబీని ఆశ్రయించేందుకు సన్నాహాలు

భద్రాచలం: భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఇచ్చే ప్రతి సర్టిఫికెట్‌కు ధరలను నిర్ణయించి, వారి అవసరాల మేరకు పిండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయంలో అత్యధికంగా కులం, కుటుంబం, ఆదాయం, కల్యాణలక్ష్మి, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాల నుంచి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం దరఖాస్తుదారులు గడువు అనంతరం నేరుగా మీ సేవకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలను నేరుగా తీసుకోవాలి. ఇది ప్రభుత్వం రూపొందించిన నియమావళి. కానీ, క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా జరుగుతోంది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో ఆర్‌ఐ, తహసీల్దార్‌లు పరిశీలించి, ఆన్‌లైన్‌లో అప్రూవ్‌ చేయాలి. కానీ, రోజుల తరబడి ఈ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు నేరుగా కార్యాలయంలోనే సంప్రదించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని సర్టిఫికెట్‌కో రేటును నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

‘డిజిటల్‌ కీ’ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వద్ద..

కాగా, తహసీల్దార్‌ అనుమతితో అప్రూవ్‌ చేసే డిజిటల్‌ కీ తహసీల్దార్‌ వద్దనే నిబంధనల ప్రకారం ఉండాలి. లేదా ఆయన అనుమతి, పర్యవేక్షణతో ప్రభుత్వ ఉద్యోగి ఈ డిజిటల్‌ కీని ఉపయోగించాలి. ఈ కార్యాలయంలో ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఈ డిజిటల్‌ కీని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఆ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నత ఉద్యోగి బంధువు అని ప్రచారం సాగుతోంది. ఆయన ద్వారానే ఈ సర్టిఫికెట్లు, ఇతర పథకాల ధ్రువపత్రాలకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సదరు ఉన్నత ఉద్యోగి ఇక్కడ తన వసూళ్లకు అడ్డుగా ఉన్నారనే సాకుతో కొందరిని డిప్యూటేషన్‌పై పంపించి, తనకు అనుకూలమైన వారిని ఇక్కడికి డిప్యూటేషన్‌ఫై తీసుకొచ్చి దందాను నిరాటకంగా సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

ఏసీబీని ఆశ్రయించేందుకు సన్నాహాలు

కాగా, ఈ అధికారి వసూళ్ల దందాను తట్టుకోలేక దరఖాస్తుదారులు, పథకాల లబ్ధిదారులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేద వర్గాలకు అండగా ఉండి, విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లను జారీ చేయాల్సి ఉండి, సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అధికారే వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి ఆర్‌ఐని అదుపులోకి తీసుకున్న ఘటన సైతం చోటుచేసుకుంది. ఇటీవలికాలంలో ప్రజల్లో చైతన్యం వచ్చి అవినీతి అధికారుల లంచాలకు చెక్‌ పెట్టేందుకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.

దరఖాస్తుదారులకు ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం వాటి ధరలను నిర్ణయించారని తెలుస్తోంది. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్న మున్నూరుకాపునకు రూ.5 వేలు, లేకపోతే రూ.10 వేలు, కల్యాణలక్ష్మికి రూ.10 వేలు, ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు రూ.5 వేలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు రూ.3 వేలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవికాకుండా అత్యవసరంగా ఉన్నత విద్యకో, ఉద్యోగానికో సర్టిఫికెట్‌ అవసరమైతే వారి పంట పండినట్లే. అందిన కాడికి దోచుకోవడమే.

నా దృష్టికి వస్తే విచారణ చేయిస్తా

భద్రాచలం మండల రెవెన్యూ కార్యాలయంలో సర్టి ఫికెట్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. కార్యాలయంలో పారదర్శకంగా ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్నాం.

– ధనియాల వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement