పవర్ సెంటర్‌గా ‘పేట’ !
మున్సిపాలిటీగా మళ్లీ కీలకం..
అశ్వారావుపేట: అశ్వారావుపేట జమీన్‌దారీ పాలనలో ఉన్నప్పటి నుంచీ రాజకీయంగా పవర్ సెంటర్‌గా వెలిగింది. దొరల పాలనలో ఉన్నప్పుడు అశ్వారావుపేట దివాణం పరిధిలో ప్రస్తుత అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, దమ్మపేట మండలాలు ఉండేవి. పాల్వంచ సంస్థానంలో అశ్వారావుపేట జమీన్ ఓ భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం.. స్వపరిపాలలో భాగంగా వేంసూరు నియోజకవర్గంలో అశ్వారావుపేట జమీన్‌ను కలిపారు. ఆ తర్వాత అదే సత్తుపల్లి నియోజకవర్గంగా మారింది. పాలనా సౌలభ్యం కోసం నాటి ఏపీ ప్రభుత్వం 1959లో ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితులు మరియు జిల్లా పరిషత్’ చట్టం చేస్తూ సుమారు 80 వేల జనాభా, కనీసం 20 గ్రామపంచాయతీలతో ఒక సమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారమే ఏర్పాటయ్యే సమితి విధివిధానాలు, పాలనా బాధ్యతలను బల్వంత్‌రాయ్ మెహతా సంఘం సిఫార్సుల ఆధారంగా 1959 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇలా ఏర్పాటైన అశ్వారావుపేట సమితిలో ప్రస్తుత అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు ఉండేవి. గ్రామపంచాయతీల సర్పంచ్‌లు సమితి సభ్యులను ఎన్నుకునే వారు. వీరిలో ఒకరిని అధ్యక్షడిగా ఎన్నుకునేవారు. అప్పట్లో గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, రహదారులు అన్నింటినీ సమితి నుంచే పర్యవేక్షించేవారు. పాలనా సౌలభ్యం కోసం అశోక్ మెహతా సంఘం సిఫార్సుల మేరకు 1987లో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను తీసుకురావడంతో సమితులు రద్దయ్యాయి. అశ్వారావుపేట సమితి చివరి అధ్యక్షుడిగా కందిమళ్ల వెంకట్రావు పనిచేశారు.
నాడు సమితి.. నేడు మున్సిపాలిటీ
అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత పెద్ద పదవి మున్సిపల్ పాలకవర్గానిదే. దీంతో అశ్వారావుపేట జమీన్‌దార్, సమితి కాలంలో ఇక్కడి రాజకీయ నాయకులకు ఉన్న పెత్తనం, పవర్ తిరిగి రానుందని చెప్పొచ్చు. అశ్వారావుపేట దివాణం పాలకులు ఎవరిని సూచిస్తే వారే ఎమ్మెల్యేలుగా పదవులు పొందారంటే అశ్వారావుపేట పవర్ సెంటర్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో చైర్ పర్సన్‌గా ఎవరు ఎన్నికై నా ఎమ్మెల్యే తర్వాతి ప్రొటోకాల్ లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆ పీఠం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నిధుల ప్రవాహం పెరగడంతో సమితి తరహాలో అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఉంది.
పవర్ సెంటర్‌గా ‘పేట’ !


